Bubonic Plague In USA: అమెరికాలో బయటపడ్డ అరుదైన బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి కేసు!

Rare Case Of Bubonic Plague In US It Killed 50 Million In 14th Century
  • ఓరేగాన్ రాష్ట్రంలో వెలుగుచూసిన వైనం
  • పెంపుడు పిల్లి కారణంగా రోగి ఈ వ్యాధి బారినపడ్డట్టు అధికారుల అంచనా
  • రోగి త్వరలోనే కోలుకుంటారంటున్న వైద్యులు
  • 14వ శతాబ్దంలో ఐరోపాలో మూడోవంతు జనాభాను బలితీసుకున్న వ్యాధి
పద్నాలుగవ శతాబ్దంలో ఐరోపాలో విలయం సృష్టించిన బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి కేసు అమెరికాలో తాజాగా బయటపడింది. ఓరేగాన్ రాష్ట్రంలోని ఓ వ్యక్తి తన పెంపుడు పిల్లి కారణంగా ఈ వ్యాధి బారినపడ్డారు. డెస్‌చుట్స్ కౌంటీకి చెందిన పేషెంట్ వివరాలు ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. అయితే, రోగికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 

సదరు రోగికి సమీపంలోకి వచ్చిన వారందరినీ అలర్ట్ చేశామని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ కొత్త ప్లేగు కేసులేవీ బయటపడలేదని చెప్పారు. వ్యాధి తొలి దశలోనే కనుగొనడంతో రోగి పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. తమ ప్రాంతంలో బ్యూబోనిక్ ప్లేగు చాలా అరుదని, 2015లో చివరిసారిగా ఓ కేసు బయటపడిందని తెలిపారు. 

వ్యాధి బారిన పడ్డ ఎనిమిది రోజులకు పేషెంట్లో రోగ లక్షణాలు బయటపడతాయి. జ్వరం, వికారం, వాంతులు, బలహీనత, చలి, కండరాల నొప్పులు వేధిస్తాయి. సకాలంలో చికిత్స అందకపోతే ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా ఊపిరితిత్తులకు చేరి ప్రాణాంతకంగా మారుతుంది. 

ఎలుకలు, పెంపుడు జంతువుల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 14వ శతాబ్దంలో ఐరోపాలో విలయం సృష్టించింది. అక్కడి జనాభాలో ఏకంగా మూడో వంతును పొట్టనపెట్టుకుంది. నాటి సంక్షోభానికి కాల క్రమంలో ‘బ్లాక్ డెత్’ అన్న పేరు స్థిరపడింది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వ్యాధి దాదాపుగా అంతరించిపోయింది. అయితే, ప్రభుత్వాలు ఇప్పటికీ దీన్నో ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలతో ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయొచ్చు.
Bubonic Plague In USA
Oregon
Black Death
Bubonic Plague
USA

More Telugu News