Nara Lokesh: మీ బిడ్డను అని జగన్ ఎందుకు చెప్పుకుంటాడో ఇప్పుడు నాకు అర్థమైంది: నారా లోకేశ్

Lokesh slams Jagan in Shankharavam
  • పాలకొండలో శంఖారావం సభ
  • హాజరైన నారా లోకేశ్
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
  • జగన్ ను తల్లి, చెల్లే నమ్మడంలేదని ఎద్దేవా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం యాత్ర కొనసాగిస్తున్నారు. నేడు శంఖారావం యాత్రకు మూడో రోజు కాగా, పాలకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభకు లోకేశ్ హాజరయ్యారు. 

ఇటీవల విడుదలైన యాత్ర-2 చిత్రాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారని అన్నారు. వైసీపీ నేతలకు టికెట్లు ఇచ్చి ఆ సినిమా చూడాలని అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. వైసీపీకి అంతిమయాత్ర మొదలైందని లోకేశ్ స్పష్టం చేశారు. 

ఇక, జగన్ కు రంగుల బొమ్మలు అంటే చాలా ఇష్టమని, టీడీపీ హయాం నాటి భవనాలకు రంగులేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మీ బిడ్డను అంటూ జగన్ పదే పదే ఎందుకు చెప్పుకుంటాడో ఇప్పుడు నాకు అర్థమైంది... మీ బిడ్డను కాబట్టి మీ భూములు నాకే ఇవ్వండి అని చెబుతారు అంటూ లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా... మీ తల్లి, చెల్లే మిమ్మల్ని నమ్మట్లేదు... మిమ్మల్ని మేం ఎలా నమ్మాలి? ఎన్నికల ముందు తల్లిని, చెల్లిని ఉపయోగించుకున్నాడు. పాపం... వాళ్లు మన ప్రాంతానికి కూడా వచ్చి ప్రచారం చేశారు. ఇప్పుడా తల్లిని, చెల్లిని జగన్ మెడపట్టి బయటకు గెంటేశాడు. 

సొంత చెల్లెలు షర్మిల ఒకవైపు, సునీత మరోవైపు మాకు రక్షణ లేదు... రక్షణ కల్పించండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. వాళ్లింట్లో ఉన్న ఆడపడుచులకే రక్షణ లేకపోతే, తెలుగింటి ఆడపడుచుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. షర్మిల వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే... పేటీఎం కుక్కలు మొరుగుతున్నాయి. ఆమెపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. 

ఏపీలో జగన్ పని అయిపోయింది... పక్క రాష్ట్రానికి పారిపోయేందుకు సిద్ధమవుతున్నాడు... మరి పేటీఎం బ్యాచ్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాలి" అంటూ లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Shankharavam
Palakonda
Jagan
TDP
YSRCP

More Telugu News