Karnataka: రామాయణ, మహాభారతాలు కల్పితాలన్న కాన్వెంట్ స్కూల్ టీచర్‌.. నిరసనలతో టీచర్ పై వేటు

Karnataka Convent School Teacher Tells Students Mahabharat Ramayan Imaginary Dismissed
  • కర్ణాటక, మంగళూరులోని ఓ కాన్వెంట్ స్కూల్‌లో ఘటన
  • ఇతిహాసాలు కల్పితాలంటూ 7వ తరగతి విద్యార్థులకు బోధించిన టీచర్
  • నరేంద్ర మోదీని కూడా టీచర్ విమర్శించిందన్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే
  • టీచర్‌ను డిస్మిస్ చేసిన స్కూల్ యాజమాన్యం

రామాయణ మహాభారతాలు ఊహాజనితాలంటూ 7వ తరగతి విద్యార్థులకు బోధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కర్ణాటక కాన్వెంట్ స్కూల్ టీచర్‌పై తాజాగా వేటు పడింది. ఆమె తీరుపై మంగళూరులో నిరసనలు వ్యక్తం కావడంతో స్కూలు యాజమాన్యం ఆమెను విధుల నుంచి డిస్‌మిస్ చేసింది. మంగళూరులోని సెయింట్ జెరోసా ఇంగ్లిష్‌ హెచ్‌ఆర్ ప్రైమరీ స్కూల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. 

రాముడు కల్పితమంటూ ప్రైమరీ స్కూలు విద్యార్థులకు టీచర్ బోధించిందంటూ ఓ వర్గం నిరసనకు దిగింది. పిల్లల ముందు గోద్రా అల్లర్లు, బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసును ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేసిందని వారు ఆరోపించారు. టీచర్‌ను తొలగించాలంటూ శనివారం నిరసనకు దిగారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వేద్యాస్ కామత్‌ కూడా వారికి మద్దతు పలికారు.

‘‘ఇలాంటి టీచర్‌కు మీరు మద్దతు ఇస్తారా? మీ నైతికత ఏమైంది? టీచర్‌‌ను ఇంకా ఎందుకు విధుల్లో కొనసాగనిస్తున్నారు? మీ సిస్టర్లు హిందూ పిల్లలకు బొట్టు పెట్టుకోవద్దని, పూలు పెట్టుకోవద్దని చెబుతున్నారు. మీ నమ్మకాలను ఇలా అవమానపరిస్తే మీరు ఊరుకుంటారా?’’ అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఈ ఘటనపై డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్ దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్‌ను స్కూల్ యాజమాన్యం డిస్‌మిస్ చేసింది. 60 ఏళ్ల స్కూలు చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని స్కూల్ యాజమాన్యం ఈ సందర్భంగా తెలిపింది. పోయిన నమ్మకాన్ని తిరిగి పొందేందుకు తామందరం కలిసి పనిచేస్తామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

  • Loading...

More Telugu News