Komatireddy Venkat Reddy: అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెర్సస్ హరీశ్ రావు.. మాటకు మాట!

Minister Komatireddy versus harish rao in Telangana assembly
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలపై మండిపడిన హరీశ్ రావు
  • ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించమని చేసిన ప్రభుత్వ ప్రకటన ప్రజలు, బీఆర్ఎస్ విజయమని వ్యాఖ్య
  • కృష్ణా నీటిపై జగన్ ఏపీ అసెంబ్లీలో చెప్పిన తర్వాత కూడా మాదే తప్పన్నట్లుగా మాట్లాడితే ఎలా? అని కోమటిరెడ్డి ప్రశ్న

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య వాగ్యుద్ధం జరిగింది. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, జగన్‌తో కలిసి తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడంతో హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం తమకూ అవకాశం ఇవ్వాలని కోరారు. పీపీటీ ద్వారా వాస్తవాలను వివరిస్తామన్నారు.

కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని ప్రభుత్వం ప్రకటన చేసిందని... ఇది తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ విజయమన్నారు. రేపు నల్గొండలో బీఆర్ఎస్ భారీ సభ పెడుతున్నందునే మంత్రి నుంచి ఈ ప్రకటన వచ్చిందని... తప్పులను సవరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వివలేదా? ఏపీ సీఎం చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పు చేసినట్లుగా మాట్లాడితే ఎలా? అని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించారన్నారు. కేసీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలు తమ జిల్లాను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కారణంగా వ్యవసాయానికి మాత్రమే కాదు.. తాగునీటికీ ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలన్నారు.

రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను అలా అనడం సరికాదని... కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News