Daggubati Purandeswari: ఏపీలో పొత్తులపై పురందేశ్వరి వ్యాఖ్యలు

  • ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారు
  • బీజేపీ వైఖరిపై ఇంకా స్పష్టత రాని వైనం
  • పొత్తులపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్న ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి
  • సరైన సమయంలో నిర్ణయం వెలువడుతుందని వెల్లడి
Purandeswari comments on alliance in AP

ఏపీలో పొత్తుల అంశం ఆసక్తికర రూపు దాల్చింది. టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా... బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఏపీలో పొత్తుపై బీజేపీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. 

పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళతామని, ఎప్పటికప్పుడు సమయానుకూలంగా తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. కేవలం పొత్తులపైనే ఆధారపడి తాము ఏ కార్యక్రమాలు చేపట్టబోమని పురందేశ్వరి స్పష్టం చేశారు. తమ ప్రయత్నాలన్నీ పార్టీ బలోపేతం కోసమేనని ఉద్ఘాటించారు. 

దేశంలో 2014కి ముందు స్కాంల పర్వం ఉండేదని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక భారతదేశ రూపురేఖలే మారిపోయాయని పురందేశ్వరి కొనియాడారు. యూపీఏ హయాంలో రోజుకు ఒక కిలోమీటరు అయినా రోడ్ల నిర్మాణం జరగలేదని విమర్శించారు. ఉచితాలకు, సంక్షేమానికి తేడా ఉందని అభిప్రాయపడ్డారు.

More Telugu News