England Vs India: ఇంగ్లండ్‌తో చివరి 3 టెస్టులకు తనను ఎంపిక చేయకపోవడంపై పేసర్ ఉమేశ్ యాదవ్ స్పందన

Umesh Yadavs reaction on his name missed in squad selected for the last 3 Tests against England series
  • పుస్తకాల మీద దుమ్ము పేరుకుపోయినంతగా కథలు మరుగునపడిపోవంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
  • టీమిండియాలో పునరాగమనంపై ఆశాజనకంగా ఉన్న పేసర్
  • దేశవాళీ క్రికెట్‌లో కష్టపడుతున్న ఉమేశ్ యాదవ్
టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ క్రికెట్ కెరీర్ ఆరంభంలో అతడు భవిష్యత్‌ స్టార్‌గా మారతాడని క్రికెట్ నిపుణులు, దిగ్గజ క్రికెటర్లు అభివర్ణించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఉమేశ్ జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. ఇంకా చెప్పాలంటే ద్వితీయ శ్రేణి పేసర్ల జాబితాలో కూడా అతడి పేరు వినిపించడం లేదు. ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్‌లో అతడి పేరుని పరిగణనలోకి తీసుకోకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇటీవలే చివరి 3 మ్యాచ్‌లకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతడి పేరు లేదు. దేశవాళీ క్రికెట్‌లో ఇటీవల ఉమేశ్ చక్కటి ప్రదర్శన చేస్తుండడంతో రీఎంట్రీకి అవకాశం ఉందంటూ అంచనాలు వెలువడ్డాయి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో ఉమేశ్ యాదవ్ ఆసక్తికరంగా స్పందించారు. 

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిగూఢమైన సందేశాన్ని పోస్ట్ చేశాడు. ‘‘పుస్తకాల మీద దుమ్ము పేరుకుపోయినంతగా కథలు మరుగునపడిపోవు’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. టీమిండియాలోకి పున:ప్రవేశంపై ఉమేశ్ యాదవ్ ఆశాజనకంగా ఉన్నట్టు ఈ సందేశం ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు దేశవాళీ క్రికెట్‌లో ఉమేశ్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. రంజీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసిన ఉమేశ్ తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు. అంతేకాదు టెస్ట్ ఫార్మాట్‌ క్రికెట్‌లో తన పేరుని విస్మరించొద్దనేలా సెలక్టర్లకు ఒక సందేశాన్ని ఇచ్చాడు.

ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు జట్టుని ప్రకటించిన తర్వాత ఉమేశ్ ఈ విధంగా స్పందించాడు. కాగా ఉమేశ్ యాదవ్ చివరిసారిగా 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడాడు. టీమిండియా ఫైనల్ చేరుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
England Vs India
Umesh Yadav
BCCI
Team India
Ranji Trophy

More Telugu News