Mallu Bhatti Vikramarka: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ: మంత్రి భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka budget speech
  • తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క
  • గత పదేళ్ల కాలంలో జరిగిన తప్పులను చక్కదిద్దుతామని వెల్లడి
  • రైతు బంధు నిబంధనలు పునఃపరిశీలిస్తామని స్పష్టీకరణ
  • ధరణి కొందరికి ఆభరణంలా, చాలామందికి భారంలా మారిందన్న భట్టి

తెలంగాణ ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కార్యాచరణపై త్వరలోనే ప్రకటన చేస్తామని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధిలో గత పదేళ్ల కాలంలో జరిగిన తప్పులను చక్కదిద్దుతామని అన్నారు. 

గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో అనర్హులకే ఎక్కువ ప్రయోజనం దక్కిందని భట్టి విక్రమార్క విమర్శించారు. అందుకే రైతు బంధు నిబంధనలను పునఃపరిశీలన జరపాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. 

ఇక, మిషన్ భగీరథలో రూ.35,752 కోట్లు ఖర్చు చేసినట్టు గత ప్రభుత్వం చెప్పిందని, అంత ఖర్చు చేసినప్పటికీ ఇంకా సురక్షిత నీరు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నీటి పారుదల రంగంలో తప్పిదాలు అభివృద్ధికి అడ్డంకులుగా మారాయని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

తన బడ్జెట్ ప్రసంగంలో మల్లు భట్టి విక్రమార్క ధరణి పోర్టల్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ధరణి కొందరికి ఆభరణంలా మారితే, చాలామందికి భారంలా తయారైందని విమర్శించారు. ధరణి పోర్టల్ ఇబ్బందుల అధ్యయనానికి ఇప్పటికే కమిటీ వేశామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News