Pak Army: పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలపై ఆర్మీ స్పందన ఇదే..!

Pakistan Army Chief Says Need To Move On From Politics Of Anarchy
  • ఫలితాలలో మెజారిటీ మార్కును అందుకోలేకపోయిన పార్టీలు
  • ఎవరికి వారే విజయం తమదేనని ప్రకటించుకున్న షరీఫ్, ఇమ్రాన్
  • అరాచక పాలన తాలూకు గాయాలకు మందుపూసే స్థిరమైన ప్రభుత్వం కావాలన్న ఆర్మీ చీఫ్
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ కూడా మెజారిటీ సీట్లను గెలుచుకోలేదు. మొత్తం 265 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాలలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు 99 చోట్ల గెలుపొందారు. ఇక, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (పీఎంఎల్ - ఎన్) పార్టీ 71 సీట్లను గెలుచుకోగా, భిలావల్ భుట్టో జర్దారీ పార్టీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 53 సీట్లలో గెలిచింది. మరో 27 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మరో 15 సీట్లలో ఫలితాలు ఇప్పటికీ వెలువడలేదు.

ఎన్నికల ఫలితాలపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ స్పందిస్తూ.. దేశానికి ప్రస్తుతం స్థిరమైన ప్రభుత్వం అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. అరాచక పాలనకు సంబంధించిన గాయాలకు మందుపూస్తూ, అభివృద్ధి వైపుగా దేశాన్ని నడిపించే ప్రభుత్వం కావాలని అభిప్రాయపడ్డారు. పాతిక కోట్ల జనాభా ఉన్న దేశానికి అరాచక పాలన శోభనివ్వదని చెప్పారు. ఎన్నికలంటే గెలుపు ఓటములు కాదని, ప్రజా తీర్పుకు కట్టుబడి ఉండే ప్రక్రియ అని అసీం మునీర్ పేర్కొన్నారు. ఈమేరకు పాక్ ఆర్మీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

గెలుపు మాదే.. కాదు మాదే..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ 133 సీట్లు కాగా.. ఈ సంఖ్యకు దగ్గరలో ఏ పార్టీ లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఓవైపు పార్టీ గుర్తుతో పోటీ చేయకుండా పీటీఐపై నిషేధం ఉండడంతో ఇమ్రాన్ ఖాన్ తన అభ్యర్థులను ఇండిపెండెంట్ గా నిలబెట్టారు. తాజాగా వెలువడిన ఫలితాల్లోనూ వాళ్లే ఎక్కువ చోట గెలిచారు. అయితే, వారికి పార్టీ గుర్తు లేకపోవడంతో తమదే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని, ఈ ఎన్నికల్లో తామే గెలిచామని నవాజ్ షరీఫ్ ప్రకటించుకున్నారు. తన అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచారు కాబట్టి తనదే విజయమని ఇమ్రాన్ ఖాన్ వర్చువల్ గా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Pak Army
Pak Elections
Election Results
Pak Army chief
PTI
PML-N
ppp

More Telugu News