Attack In USA: వాషింగ్టన్ వీధిలో జరిగిన దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి

Another Indian Origin Attacked In Washington Died In Hospital
  • రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి నడుచుకుని వెళ్తుండగా ఘటన
  • రోడ్డుపై పడేసి పేవ్‌మెంట్‌కేసి తలను బాది దారుణం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • నిందితుడి వివరాలు చెబితే 25 వేల డాలర్ల నజరానా ప్రకటన
అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆరుగురు వివిధ కారణాలతో మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. వాషింగ్టన్ రెస్టారెంట్‌ బయట జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆపై మృతి చెందాడు. మృతుడిని వర్జీనియాకు చెందిన వివేక్ తనేజాగా గుర్తించారు. ఈ నెల 2న జరిగిందీ ఘటన. బాధితుడిని కిందపడేసిన నిందితుడు ఆపై పేవ్‌మెంట్‌కేసి తలను బాదాడు. తీవ్రంగా గాయపడిన వివేక్ మరణించాడు. 

41 ఏళ్ల వివేక్ అర్ధరాత్రి 2 గంటలు దాటాక రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చి వీధిలోంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన వెనకున్న కారణమేంటన్నది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితుడు స్పృహ కోల్పోయి పడి వున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అతను ప్రాణాలు విడిచాడు. 

ఘటనా స్థలంలోని సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. నిందితుడికి సంబంధించిన వివరాలు చెప్పిన వారికి 25 వేల డాలర్ల బహుమతి ప్రకటించారు. ఈ వారం మొదట్లో షికాగోలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ విద్యార్థి సయ్యద్ ముజాహిర్ అలీపై దాడిచేసి దుండగులు దోచుకున్నారు. అమెరికాలో ఇప్పటికే శ్రేయాస్ రెడ్డి బెనిగెర్ (19), నీల్ ఆచార్య, వివేక్ సైనీ (25), అకుల్ ధావన్ మృతి చెందారు.
Attack In USA
Washington
Indian
Attack
Crime News

More Telugu News