Ravindra Jadeja: కోడలిపై తీవ్ర ఆరోపణలు చేసిన రవీంద్ర జడేజా తండ్రి

Ravindra Jadeja father Anirudh Singh made severe claims on daughter in law Rivaba
  • టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబంలో వివాదాలు
  • కోడలు రివాబా తమ కుటుంబంలో చిచ్చు పెడుతోందన్న అనిరుధ్ సింగ్ జడేజా
  • ఆమె తమ కుటుంబంలో అడుగుపెట్టిన కొన్నిరోజులకే  గొడవలు వచ్చాయని వెల్లడి

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబ వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా కోడలు రివాబాపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు రివాబా తమ కుటుంబంలో చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జడేజా అర్ధాంగి రివాబా బీజేపీ ఎమ్మెల్యే అన్న సంగతి తెలిసిందే. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా జామ్ నగర్ (నార్త్) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు కూడా వారి కుటుంబంలో వివాదాలు తెరపైకి వచ్చాయి. 

తాజాగా, జడేజా తండ్రి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "రివాబా మా ఇంట్లో అడుగుపెట్టిన కొన్ని రోజులకే గొడవలు మొదలయ్యాయి. మా కుటుంబ ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు కావాలని రివాబా డిమాండ్ చేస్తోంది. పెళ్లయిన నెల రోజులకే మా అబ్బాయి రవీంద్ర జడేజా పేరుమీదున్న రెస్టారెంట్ ను తన పేరు మీదకు మార్చమని గొడవ చేసింది. 

రివాబా పుట్టింటి వాళ్లు కూడా తక్కువ తినలేదు. మా అబ్బాయి రవీంద్ర జడేజా సంపాదనను అప్పనంగా భోంచేస్తున్నారు. మావాడికి చెందిన ఖరీదైన ఆడి కారు, రూ.2 కోట్ల విలువైన బంగ్లా, కొన్ని విలాసవంతమైన ఐటెంలను వాళ్లు వాడుకుంటున్నారు. నా మనవరాలిని చూసి ఐదేళ్లయింది. రవీంద్ర జడేజా ఎదుగుదలలో అతడి సోదరి నయన్ బా పాత్ర ఎంతో ఉంది" అంటూ అనిరుధ్ సింగ్ జడేజా వివరించారు. 

జడేజా, రివాబా సోలంకి 2016లో పెళ్లి చేసుకున్నారు. వీరికి నిధ్యాన అనే కుమార్తె ఉంది.

  • Loading...

More Telugu News