Maldives: దౌత్య వివాదం వేళ భారత్, మాల్దీవుల మధ్య చర్చలు!

  • మాల్దీవుల కస్టమ్స్ విభాగం కమిషనర్‌ జనరల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన భారత హైకమిషనర్  
  • వాణిజ్యం, భద్రత, కస్టమ్స్ విభాగం సామర్థ్యం పెంపుపై చర్చ
  • పలు రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయం
Amid Standoff India Maldives Discuss Trade Mutual Security

భారత్, మాల్దీవుల మధ్య దౌత్య వివాదం నెలకొన్న వేళ ఆ దేశంలోని భారత హై కమిషనర్ మును మహవర్, మాల్దీవుల కస్టమ్స్ శాఖ కమిషనర్‌ జనరల్ యూసుఫ్ మానియు మహ్మద్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, భద్రత, కస్టమ్స్ విభాగం సామర్థ్య పెంపు తదితర విషయాలపై చర్చించారు. 

మాల్దీవుల కస్టమ్స్ సర్వీసెస్, భారత్‌కు చెందిన కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ మధ్య వివిధ అంశాల్లో సహకారం కొనసాగాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 

సమావేశం వివరాలను భారత హైకమిషన్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. వివిధ అంశాల్లో సహకారం, సమన్వయం మెరుగుపరుచుకునేందుకు ఇరు దేశాలు నిర్ణయించాయని వెల్లడించింది. కస్టమ్స్ శాఖ అధికారులకు శిక్షణ, సామర్థ్యం పెంపు విషయాల్లోనూ సహకరించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. 

ఇదిలా ఉంటే, మాల్దీవుల్లోని భారత్ మిలిటరీ సిబ్బంది స్థానంలో నిపుణులైన టెక్నికల్ సిబ్బందిని నియమిస్తామని కేంద్రం గురువారం ప్రకటించింది. ఈ దిశగా ఫిబ్రవరి 2న ఓ సమావేశం జరిగింది. ఈ నెలాఖరులో మరో సమావేశం నిర్వహించనున్నారు.

More Telugu News