Nithin Gadkari: మంచివాళ్లకు గౌరవం ఉండదు.. చెడ్డవాళ్లకు శిక్ష పడదు: నితిన్ గడ్కరీ

Person Who Does Good Work Never Gets Respect Nitin Gadkari
  • లోక్‌మత్ మీడియా గ్రూప్ మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ప్రసంగం
  • అవకాశవాద రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేసిన వైనం
  • సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య తగ్గిపోతోందని ఆవేదన

అవకాశవాద రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. స్వార్థప్రయోజనాల కోసం కొందరు అధికారం ఉన్న పార్టీలతో అంటకాగేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. సైద్ధాంతిక నిబద్ధత లేని ఇలాంటి వారితో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే రాజకీయ నాయకులు రోజురోజుకూ తగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘నేను ఎప్పుడూ జోక్ గా చెప్పేది ఏంటంటే.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మంచి పనులు చేసేవాళ్లకు ఎప్పుడూ గుర్తింపు, గౌరవం దక్కవు, చెడ్డవాళ్లకు శిక్షా పడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తమ పార్లమెంటు సభ్యులను సత్కరించేందుకు లోక్‌మత్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

పార్లమెంటు చర్చల్లో అభిప్రాయభేదాలు ఉండటం సమస్య కాదని, కొత్త ఆలోచనలు లేకపోవడమే సమస్య అని మంత్రి గడ్కరీ తెలిపారు. ప్రచారం, గుర్తింపు అవసరమేగానీ నాయకులు తమ నియోజకవర్గాల ప్రజలకు ఎంత మేలు చేశారనేదే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యంపై కూడా నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని అన్నారు. ఆయన వ్యక్తిత్వం, ప్రవర్తన, నిరాడంబరత ఎంతో గొప్పవని అన్నారు. వాజ్‌పేయ్ తరువాత తనను అత్యధికంగా ప్రభావితం చేసింది ఫెర్నాండెజ్‌ అని పేర్కొన్నారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారత రత్న అవార్డుకు ఎంపికైన కర్పూరీ ఠాకూర్‌పై కూడా మంత్రి గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన భారత ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేశారన్నారు. సీఎం పదవి నుంచి దిగిపోయాక ఆయన రిక్షాల్లో ప్రయాణించేవారని, అత్యంత సాధారణ జీవితం గడిపారని తెలిపారు. నేటి రాజకీయ నాయకులు అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News