Indrakaran Reddy: రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లి సభ నిర్వహించి నివాళులు అర్పించడం హాస్యాస్పదం: బీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డి

Indra Kiran Reddy comments on Revanth Reddy
  • అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసులను బలితీసుకున్నారని ఆరోపణ
  • నాటి ఇంద్రవెల్లి ఘటనను యావత్ భారత్ ఖండించిందన్న ఇంద్రకరణ్
  • అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడూ ఆదివాసులను పట్టించుకోలేదని విమర్శ

40 ఏళ్ల క్రితం ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని... అలాంటి కాంగ్రెస్ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అక్కడకు వెళ్లి సభ నిర్వహించి.. ఇంద్రవెల్లి అమరులకు నివాళులు అర్పించడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నిర్మల్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో... అంజయ్య సీఎంగా ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసులను బలి తీసుకున్నారని ఆరోపించారు. నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్‌‌దే అన్నారు. నాటి ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను యావత్ భారత్ ఖండించిందన్నారు.

ఈ మారణకాండలో 250 మందికి పైగా ఆదివాసులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత చరిత్ర తెలియని నేటి కాంగ్రెస్‌ నేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇంద్రవెల్లిలో సభ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడూ ఆదివాసులను పట్టించుకోలేదన్నారు. కేవలం గిరిజనుల ఓట్ల కోసమే ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి సభ పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన, ఆదివాసీ గూడేలు అభివృద్ధి చెందాయన్నారు.

అడవి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసినట్లు చెప్పారు. తండాలను, గూడేలను పంచాయతీలుగా మార్చి 'మా ఊళ్లో-మా రాజ్యం' నినాదాన్ని సాకారం చేశామన్నారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడమే కాకుండా మారుమూల పల్లె బడుల్లో ఆంగ్ల విద్యను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజలతో కలిసి పోరాడుతామన్నారు.

  • Loading...

More Telugu News