Nara Lokesh: కానిస్టేబుల్ ను చంపేసిన ఎర్రచందనం స్మగ్లర్లు... తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్

Nara Lokesh fires on Red Sandal smugglers killed a constable
  • అన్నమయ్య జిల్లాలో దారుణం
  • కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • పోలీసులను వాహనంతో ఢీకొట్టిన స్మగ్లర్లు
  • ఆసుపత్రికి తరలిస్తుండగా కానిస్టేబుల్ గణేశ్ మృతి
  • వైసీపీ ఎర్ర చందనం మాఫియా దారుణాలకు పరాకాష్ఠ అంటూ లోకేశ్ ఫైర్
అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకున్న టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గణేశ్ ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. 

ఎర్రచందనం స్మగ్లర్లు తమ వాహనంతో కానిస్టేబుల్ గణేశ్ ను ఢీకొట్టారు. ఆసుపత్రికి తరలిస్తుండగా కానిస్టేబుల్ గణేశ్ మృతి చెందాడు. ఈ ఘటన నేపథ్యంలో నారా లోకేశ్ భగ్గుమన్నారు. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై మెరుపుదాడులకు పాల్పడి, కానిస్టేబుల్ గణేశ్ ని చంపేయ‌టం రాష్ట్రంలో వైసీపీ ఎర్ర చందనం మాఫియా దారుణాల‌కు ప‌రాకాష్ఠ అని ధ్వజమెత్తారు. 

"జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైంది. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్ తో వైసీపీ ఎర్ర చందనం మాఫియా అవతారం ఎత్తింది. ఎర్రచందనం స్మగ్లర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన జగన్ ఎర్ర చందనం స్మగ్లింగ్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాడు. అడ్డొచ్చిన పోలీసుల్ని వైసీపీ ఎర్ర చందనం మాఫియా చంపేస్తోంది. 

టాస్క్ ఫోర్స్ పోలీసు వాహ‌నాల‌నే ఢీకొట్టి కానిస్టేబుల్‌ని చంపేశారంటే... స‌ర్కారీ పెద్ద‌ల అండ‌దండ‌ల‌తో ఎంత‌గా బ‌రితెగించారో అర్థం చేసుకోవ‌చ్చు. విధినిర్వ‌హ‌ణ‌లో పాల‌కుల మాఫియాకి బ‌లైన కానిస్టేబుల్ గ‌ణేశ్ కి నివాళులు. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. 

గ‌ణేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. గణేశ్ ని అత్యంత కిరాతకంగా చంపేసిన ఎర్ర చందనం మాఫియాను కఠినంగా శిక్షించాలి" అంటూ నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
Nara Lokesh
Constable Ganesh
Red Sandal
Smugglers
Annamayya District
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News