D Raja: వచ్చే లోక్‌సభ ఎన్నికలపై సీపీఐ డీ.రాజా ఆసక్తికర వ్యాఖ్యలు

CPI D Raja made interesting comments on the competition in the next Lok Sabha elections
  • సముచిత స్థానాల్లో పోటీకి ఇండియా కూటమితో చర్చిస్తున్నామని వెల్లడి
  • బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశానికి విపత్తు వచ్చినట్టేనని మండిపాటు
  • హైదరాబాద్‌లో  సీపీఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన డీ రాజా
రాబోయే లోక్‌సభ ఎన్నికలు చాలా ప్రధానమైనవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. దేశ వ్యాప్తంగా సముచిత స్థానాల్లో పోటీ చేసేవిధంగా విపక్షాల ‘ఇండియా’ కూటమితో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అందుకు సంబంధించి కమిటీ కూడా వేశామని చెప్పారు. హైదరాబాద్‌లో  సీపీఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 3 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో రానున్న లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చించామని తెలిపారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశానికి విపత్తు వచ్చినట్టేనని డీ రాజా వ్యాఖ్యానించారు. వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ లాంటి వారు సురక్షితంగా ఉండగా ఝార్ఖండ్‌ మాజీ సీఎం ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారని, ఇందుకు బీజేపీనే కారణమని ఆరోపించారు.

 ‘భాజపా హఠావో దేశ్‌ బచావో’ అని తొలుత చెప్పిన నితీశ్‌ కుమార్‌ మళ్లీ బీజేపీ పంచనే చేరారని మండిపడ్డారు. ఇండియా కూటమిని మోసం చేసిన నితీశ్‌ భవిష్యత్‌లో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. మరోసారి అధికారంలోకి వస్తానని నరేంద్ర మోదీ అంటున్నారని, అయితే గత పదేళ్లలో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారని డీ రాజా ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తేలేదేంటని నిలదీశారు. ఇక మధ్యంతర బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఏమీలేదని డీ రాజా విమర్శించారు. ఫిబ్రవరి 16న వాణిజ్య, రైతు సంఘాలు నిర్వహించే బంద్‌కు తమ మద్ధతు ఉంటుందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు.
D Raja
CPI
Lok Sabha elections
BJP
Narendra Modi

More Telugu News