Kalvakuntla Kavitha: ఇంద్రవెల్లి సభకు ప్రజల సొమ్ము ఎలా ఖర్చు చేస్తారు?: ఎమ్మెల్సీ కవిత

BRS MLC K Kavitha Press Meet At Telangana Bhavan
  • తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • పార్టీ ప్రచారానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపాటు
  • అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
  • కేసీఆర్ నిర్ణయాలు కరెక్టేనని నిరూపించినందుకు సీఎంకు ధన్యవాదాలని కామెంట్
తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ ప్రచారానికి వాడుకుంటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈమేరకు శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో ప్రభుత్వం నిర్వహించిన సభను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా మార్చేశారని ఆరోపించారు. ఈ సభకు అయిన ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారా? లేక కాంగ్రెస్ పార్టీ సొమ్మా? అనేది ప్రజలకు వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కవిత నిలదీశారు. సభ కోసం ఉపయోగించిన వేదికకు, కుర్చీలు ఇతరత్రా వస్తువులకు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఇంద్రవెల్లికి వెళ్లారని, దానికైన ఖర్చును ఎవరిచ్చారని అడిగారు.

గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ మాజీ సీఎం కేసీఆర్ పై నిత్యం విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నదేంటని కవిత ప్రశ్నించారు. ప్రకటనల పేరుతో ప్రజల సొమ్మును వృథా చేయబోమన్న రేవంత్ రెడ్డి.. శుక్రవారం మీడియాలో ఎలా ప్రచారం చేసుకున్నారో, ఎన్ని ప్రకటనలు ఇచ్చారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వారానికి రెండు రోజులు ఢిల్లీకి వెళ్లి వస్తుంటారని, ఇందుకోసం ప్రైవేట్ విమానం ఉపయోగిస్తారని గుర్తుచేశారు. మరి ఈ ప్రయాణ ఖర్చుకు ఎవరి జేబులో నుంచి చెల్లిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ కి పదుల సంఖ్యలో కార్లు ఎందుకని ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్ని కార్లలో తిరుగుతున్నారని అడిగారు. సీఎం కాన్వాయ్ వస్తే ట్రాఫిక్ ను ఆపబోమని చెప్పి ఇప్పుడు ఆయన చేస్తున్నదేంటని నిలదీశారు.

ప్రజాదర్బార్ పేరుతో ప్రజలను కలుస్తానని, నిత్యం ప్రజలలోనే ఉంటానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అరవై రోజులలో కేవలం ఒక్కటంటే ఒక్క రోజు మాత్రమే ప్రజలను కలిశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కొన్ని రోజులు మంత్రులను కూర్చోబెట్టి ఆ తర్వాత ఇప్పుడు అధికారులకు వదిలేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రికి అనుభవంలోకి వస్తున్నాయని అన్నారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్ బాటలో నడుస్తున్నారని, కేసీఆర్ చేసింది కరెక్టేనని ప్రజలకు చాటిచెబుతున్నందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలంటూ వ్యాఖ్యానించారు. ప్రజల వద్దకే పాలన, పాలకులు వెళ్లాలి తప్ప పాలకుల వద్దకు ప్రజలు వచ్చే పరిస్థితి ఉండొద్దంటూ మాజీ సీఎం కేసీఆర్ తన అపార అనుభవంతో చెప్పారని కవిత గుర్తుచేశారు.

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన తప్పులను తెలుసుకుంటోందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకు తాను క్షమాపణ చెబుతున్నానని వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనమని కవిత వివరించారు. అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని, దీనికి బాధ్యత తీసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha
MLC Kavitha
BRS
Telangana Bhavan
CM Revanth Reddy
Indravelli Sabha

More Telugu News