Bandla Ganesh: లోక్ సభ ఎన్నికల్లో పోటీకి బండ్ల గణేశ్ రెడీ

Ready To Fight From Malkajigiri In Lok Sabha Elections Says Bandla Ganesh
  • మల్కాజిగిరి టికెట్ కోసం పార్టీకి దరఖాస్తు చేసిన కాంగ్రెస్ నేత
  • అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తానన్న బండ్ల గణేశ్
  • మాజీ మంత్రి మల్లారెడ్డికి మతిభ్రమించిందంటూ ఫైర్

లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలంటూ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని చెప్పారు.

క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రేవంత్ రెడ్డి పాలన చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎంపీ సీట్లు అన్నీ కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరి నుంచి లోక్ సభకు పోటీచేసే అవకాశం కల్పిస్తే గెలిచి చూపిస్తానని బండ్ల గణేశ్ చెప్పారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బండ్ల గణేశ్ తీవ్రంగా మండిపడ్డారు. మల్లారెడ్డికి మతిభ్రమించినట్లుందని, అందుకే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఫీజుల పేరుతో పీల్చిపిప్పి చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరతానని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News