DK Suresh Kumar: పరిస్థితి ఇలాగే ఉంటే దేశాన్ని ఉత్తర, దక్షిణాదిగా విడగొట్టాలి.. కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

  • తాజా బడ్జెట్‌లో కర్ణాటకకు కేంద్రం కేటాయింపులపై కాంగ్రెస్ ఎంపీ సురేశ్ అసంతృప్తి
  • దక్షిణాదికి ప్రతి దశలో అన్యాయం జరుగుతోందని మండిపాటు
  • దక్షిణాదికి ఇవ్వాల్సిన అభివృద్ధి నిధులను కేంద్రం ఉత్తరాదిన పంచుతోందని ఆరోపణ
Congress MP Sparks Fresh Row Over Budget Demands Separate Country For South

తాజా బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు సరైన కేటాయింపులు లేవంటూ కర్ణాటక ఎంపీ డీకే సురేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే దక్షిణాది రాష్ట్రాలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తామని హెచ్చరించారు. కేంద్ర నిధుల్లో తమకు తగిన వాటా రావట్లేదంటూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఇప్పటికే తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి. తాజాగా కర్ణాటక కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఎంపీ సురేశ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

ప్రతి దశలోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నిధుల్లో మా వాటా మాకు కావాలి. జీఎస్టీ, కస్టమ్స్, డైరెక్టు ట్యాక్స్ ఇలా పన్నులు ఏవైనా మా వాటాలు మాకు చెల్లించాలి. అభివృద్ధి నిధుల్లో మా వాటాను ఉత్తరాదిలో పంచిపెడుతున్నారు. హిందీ ప్రాంత పరిస్థితులు మాపై ఇలాగే రుద్దితే దక్షిణాదిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేయాల్సి ఉంటుంది’’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ నేత చౌలవాది నారాయణ స్వామి మండిపడ్డారు. కాంగ్రెస్ భారత్‌ ఏకం చేసేబదులు ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ‘‘దేశం విడగొట్టాలన్నదే కాంగ్రెస్ ఆలోచనా విధానం. 1947లో వాళ్లు ఇదే చేశారు. ఓవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుంటే వీళ్లేమో దేశాన్ని ఉత్తరాది, దక్షిణాదిగా విడగొట్టాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడతానని ప్రతినబూనిన ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు?’’ అని చలువాది మండిపడ్డారు. 

నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్పందిస్తూ గతేడాది కార్పొరేట్, ఇతర పన్నుల కింద కర్ణాటక రూ. 2.25 లక్షల కోట్లు చెల్లిస్తే టాక్స్ డివల్యూషన్ కింద కేవలం రూ. 37,252 కోట్లే వచ్చాయన్నారు. జీఎస్టీ కింద రాష్ట్రం రూ.1.4 లక్షల కోట్లు చెల్లిస్తే రాష్ట్రానికి ఇందులో వాటాగా రూ.13,005 కోట్లే వచ్చాయన్నారు. వివిధ పన్నుల కింద కర్ణాటక గతేడాది రూ.4 లక్షల కోట్లు వసూళ్లు సాధించిందని, కానీ రాష్ట్ర వాటాగా కేవలం రూ.50,257 కోట్లే వచ్చే అవకాశం ఉందని పుర్కొన్నారు. కేంద్రం కనీసం రూ.లక్ష కోట్లు కర్ణాటకకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా ఓ కూటమి ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నట్టు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ హయాంలో పన్నులకు సంబంధించి రాష్ట్ర వాటా 4.71 శాతం నుంచి 3.64 శాతానికి పడిపోయిందని తెలిపారు.

More Telugu News