Shiv Ganga Express Rail: రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు.. అధికారుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

Shiv Ganga Express Rail Missed Signals In Uttar Pradesh
  • ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఘటన
  • బర్దన్ స్టేషన్‌లో ఆగివున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు
  • వెనక నుంచి అదే ట్రాక్‌పై దూసుకొచ్చిన శివగంగ ఎక్స్‌ప్రెస్
  • అధికారుల అదుపులో లోకోపైలట్లు

రైల్వే అధికారుల అప్రమత్తత పెను ప్రమాదాన్ని తప్పించింది. స్టేషన్‌లో రైలు ఆగి ఉన్న సమయంలో అదే ట్రాక్‌పై మరో రైలు సిగ్నల్ జంప్ చేసి వేగంగా దూసుకొచ్చింది. గమనించిన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి రైలును నిలిపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగిందీ ఘటన.

ఢిల్లీ-హౌరా మార్గంలో భర్ధనా స్టేషన్‌లో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉంది. దీంతో దానికి ముందు స్టేషన్‌లో రెడ్ సిగ్నల్ పడింది. అదే సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న శివగంగ ఎక్స్‌ప్రెస్ రైలు లోకోపైలట్లు రెడ్ సిగ్నల్‌ను విస్మరించి రైలును పోనిచ్చారు. రెడ్ సిగ్నల్ పడినా రైలు ముందుకు వెళ్తుండడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రైలు ఆగిపోయింది. అప్పటికే అది కిలోమీటరు దూరం దూసుకెళ్లింది.

రైలు ఆగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తం కాకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు లోకోపైలట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంచు కారణంగా సిగ్నల్ కనిపించకపోయి ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ లోకోపైలట్లు ఎందుకు అప్రమత్తంగా లేరన్న కోణంలో విచారిస్తున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News