Shabbir Ali: మాతో టచ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ: షబ్బీర్ అలీ

  • ప్రభుత్వం ఉంటుందో... పడిపోతుందో అంటూ కేటీఆర్ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • పార్టీ ఫిరాయింపులు వద్దని అధిష్ఠానం చెప్పడంతో ఆగామన్న షబ్బీర్ అలీ
  • పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాదని జోస్యం
  • బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ అన్న షబ్బీర్ అలీ
Shabbir Ali says many brs leaders will join if we open gates

తమతో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో... పడిపోతుందో అంటూ కేటీఆర్ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మేం కనుక ద్వారాలు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని షబ్బీర్ అలీ హెచ్చరించారు. కానీ పార్టీలో చేరికల విషయమై తమ అధిష్ఠానం ఇప్పుడు వద్దని చెబుతోందన్నారు. పార్టీ ఫిరాయింపులు వద్దనడం వల్ల ఆగామని, లేదంటే ఇతర పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌లకు మధ్యనే పోటీ అని జోస్యం చెప్పారు. పదేళ్లలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదని... అప్పుడే బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని షబ్బీర్ అలీ పునరుద్ఘాటించారు.

కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని షబ్బీర్ అలీ అన్నారు. మైనార్టీలకు ఏటా పెంచాల్సిన బడ్జెట్‌లో కేవలం చాలా తక్కువ వాటా కేటాయించి అన్యాయం చేశారన్నారు. మైనార్టీలను చిన్న చూపు చూసి స్కాలర్‌షిప్ తగ్గించారని మండిపడ్డారు. ప్రధాని మోదీ సబ్ కా సాత్... సబ్ కా విశ్వాస్ అంటే బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమేనని ఎద్దేవా చేశారు.

More Telugu News