Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో కీలక పరిణామం... కేసులు కొట్టివేసిన నాంపల్లి కోర్టు

Nampally court dismiss Tollywood drugs cases
  • కొన్నాళ్ల కిందట టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం
  • అప్పట్లో సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • సినీ ప్రముఖుల గోర్లు, తల వెంట్రుకలు సేకరించిన ఎక్సైజ్ శాఖ
  • ఫోరెన్సిక్ నివేదికలు, సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు
  • సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేవన్న న్యాయస్థానం
  • 8 కేసుల్లో 6 కేసుల కొట్టివేత
టాలీవుడ్ లో కొన్నాళ్ల కిందట రేగిన డ్రగ్స్ కలకలం తాలూకు ప్రకంపనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, నేడు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశానికి సంబంధించి నమోదు చేసిన ఎనిమిది కేసుల్లో 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 

అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నెలల తరబడి టాలీవుడ్ ప్రముఖులను విచారించారు. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టి, నటి రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు కూడా జారీ చేసింది. 

ఈ కేసులో పూరీ జగన్నాథ్, తరుణ్, చార్మీ తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. పలువురు నటుల నుంచి గోర్లు, తల వెంట్రుకలు కూడా సేకరించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. 

ఈ నేపథ్యంలో, ఫోరెన్సిక్ నివేదిక, సాక్ష్యాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు... ఆరు కేసుల్లో సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేవంటూ కేసులు కొట్టివేసింది. డ్రగ్స్ కేసు విచారణలో సరైన విధానం పాటించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
Tollywood Drugs Case
Nampally Court
SIT
Hyderabad
Telangana

More Telugu News