Budda Venkanna: నాకు టిక్కెట్ ఇవ్వాలని మీ ఇద్దరినీ కోరుతున్నా: బుద్దా వెంకన్న

Budda Venkanna requests Chandrababu and Pawan Kalyan to allot ticket for him
  • కనకదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించిన వెంకన్న
  • విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు విన్నపం
  • చంద్రబాబును ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తానని హెచ్చరిక
రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జనసేనకు ఏయే నియోజకవర్గాలను కేటాయిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. పొత్తు నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు టికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ వెస్ట్ లో బల ప్రదర్శన చేశారు. కనకదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు తనకు దైవ సమానులని, ఆయనకు ఇచ్చే అప్లికేషన్ ను ముందుగా అమ్మవారికి ఇచ్చానని చెప్పారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని అప్లికేషన్ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రాణాలకు తెగించి టీడీపీ కోసం పోరాడుతున్నానని... ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని అర్హతలు తనకు ఉన్నాయని చెప్పారు. తనకు టికెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కోరుతున్నానని తెలిపారు. 

తన విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని బుద్దా వెంకన్న అన్నారు. టికెట్ రాలేదని చంద్రబాబును ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తానని హెచ్చరించారు. వైసీపీ నేత, ఎంపీ కేశినేని నానికి బుద్ధి చెప్పాలనే తాను ర్యాలీగా వచ్చానని చెప్పారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోబోనని చెప్పారు. పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టికెట్లు ఇవ్వాలని కోరారు.
Budda Venkanna
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
Kesineni Nani
YSRCP

More Telugu News