Fake Marriages: ఉత్తుత్తి పెళ్లిళ్లతో ప్రభుత్వ సొమ్ము జేబుల్లో వేసుకునే యత్నం.. యూపీలో 8 మంది అధికారులపై కేసు

Mass marriage fraud unearthed in UPs Ballia District
  • ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఘటన
  • నిరుపేద యువతీయువకులకు అందించే రూ. 51 వేల కోసం అధికారుల కక్కుర్తి
  • యువతీయువకులకు డబ్బు ఆశచూపి వధూవరులుగా వేషాలు
  • వీడియో వెలుగులోకి రావడంతో రంగంలోకి పోలీసులు
ప్రభుత్వ పథకాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో చెప్పేందుకు ఇంతకుమించిన ఉదాహరణ ఉండదేమో! నిరుపేద యువతీయువకుల పెళ్లిళ్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించే రూ. 51 వేల ఆర్థిక సాయాన్ని కొల్లగొట్టేందుకు అధికారులే అక్రమాలకు పాల్పడ్డారు. దళారులతో కలిసి ఉత్తుత్తి పెళ్లి చేసి ఆ సొమ్మును తమ ఖాతాల్లో వేసుకునే ప్రయత్నం చేశారు. విస్తుగొలిపే ఈ ఘటన వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. 

పేదల పెళ్లిళ్ల కోసం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక’ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పెళ్లి చేసుకోవాలనే యువతీయువకులకు రూ. 51 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. దీనిపై కన్నేసిన అధికారులు దళారులతో చేతులు కలిపి ఉత్తుత్తి పెళ్లి చేసి పడేసి ప్రభుత్వ సొమ్మును జేబుల్లో వేసుకునే ప్రయత్నం చేసి దొరికిపోయారు.  

బలియా జిల్లా మనియర్ పట్టణంలోని కాలేజీలో జనవరి 25న సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించారు. పెళ్లి అయిన, కాని యువతీయువకులకు రూ. 2-3 వేలు ఇస్తామని ఆశచూపి తీసుకొచ్చారు. వారితో ఉత్తుత్తి పెళ్లిళ్లు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కాస్తా సామాజిక మాధ్యమాలకు ఎక్కి ఈ నకిలీ పెళ్లితంతు విషయం వెలుగులోకి వచ్చింది.

పెళ్లిళ్లు చూసేందుకు వెళ్లిన తనను పెళ్లికొడుకు వేషం వేసుకుంటే డబ్బులు ఇస్తామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ చెప్పాడని స్థానిక యువకుడు బాలు వెల్లడించాడు. అతడు మరెంతో మందితో వధూవరుల వేషం వేయించాడని తెలిపాడు. విషయం కాస్తా వెలుగులోకి రావడంతో 8 మంది అధికారులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ నకిలీ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఇంకా నిధులు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు.
Fake Marriages
Uttar Pradesh
Yogi Adityanath
Ballia District

More Telugu News