High Court: కోదండరాం, అమీర్ ఆలీఖాన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్!

  • కోదండరాం, అమీర్ అలీఖాన్ ల నియామకాన్ని హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్ఎస్ నేతలు
  • తమ పిటిషన్ తేలేవరకు ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి 
  • యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు
Telangana high court break to Kodandaram swearing ceremony

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 8వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని తెలిపింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ప్రభుత్వం ప్రతిపాదించగా... గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం చేశారు. వారు ప్రమాణం చేయాల్సి ఉంది.

అయితే వీరి నియామకాలను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. గత ఎమ్మెల్సీ అంశం తేలే వరకు వారి ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా... నిబంధనల ప్రకారం లేదని గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. అయితే తమను తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారు ప్రమాణానికి సిద్ధమవుతుండగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

More Telugu News