Mamata Banerjee: మమతా బెనర్జీ చెంపలు పగలగొట్టండి.. ప్రజలకు పిలుపునిచ్చిన బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్

BJP Bengal Chief Sukanta Majumdar Controversial comments On Mamata Banerjee
  • విద్యావ్యవస్థను మమత భ్రష్టు పట్టించారన్న సుకాంత మజుందార్
  • పిల్లలు చదువులో రాణించలేకపోవడం వారి తప్పుకాదన్న బీజేపీ బెంగాల్ చీఫ్
  • పిల్లల్ని కొట్టడానికి బదులు మమతను చెంపదెబ్బలు కొట్టాలని పిలుపు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతూ.. సీఎంను చెంపదెబ్బలు కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మథురాపూర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో మజుందార్ మాట్లాడుతూ.. చదువుల్లో మన పిల్లలు రాణించకపోవడం వారి తప్పు కాదని, తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడానికి బదులు మమత చెంపలు పగలగొట్టాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మమత విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని మజుందార్ దుయ్యబట్టారు. 

మజుందార్ వ్యాఖ్యలపై టీఎంసీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. భౌతికదాడులను ఆయన ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజుందార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు సిగ్గుచేటని టీఎంసీ నేత మహువా మెయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుకాంత వ్యాఖ్యలకు నిరసనగా టీఎంసీ మహిళా విభాగం నేడు (మంగళవారం) ర్యాలీ నిర్వహించనుంది.   
Mamata Banerjee
Sukanta Majumdar
BJP
TMC
West Bengal

More Telugu News