Margani Bharat: చంద్రబాబుకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సవాల్

Margani Bharat open challenge to Chandrababu
  • బాబు తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్
  • ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టీకరణ
  • టీడీపీ పాలన కంటే ఎక్కువగా రాజమండ్రిని తాను అభివృద్ధి చేశానని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. తనపై బాబు చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేసి జైలుపాలైన చంద్రబాబు తనను విమర్శించొచ్చా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ మార్గాని భరత్ బాబు ఆరోపణలను ఖండించారు. 

తాను నీతి, నిజాయతీగా రాజకీయ సేవ చేసేందుకు వచ్చానని స్పష్టం చేశారు. సొంత ఆస్తులు అమ్ముకుని ప్రజల హృదయాలలో స్థానం సంపాదించడం కోసం రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. బాబు, ఆయన పార్టీ వాళ్లలా రాజకీయాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించడానికి రాలేదన్నారు. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే కుటుంబసభ్యులు వడ్డీ వ్యాపారాలు, చీట్ల వ్యాపారాలు చేసి అడ్డంగా దొరికి సెంట్రల్ జైల్లో ఉండొచ్చారని విమర్శించారు. అలాంటి వారిని పక్కన పెట్టుకుని బాబు తనను విమర్శించడం దొంగే దొంగా అని అరిచినట్టు ఉందని విమర్శించారు. ఆవ భూముల్లో తనకు రూ.150 కోట్లు ఎవరిచ్చారో చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 

బాబు చెబుతున్న మహిళలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు జన్మభూమి కమిటీలు, కార్యకర్తలకే తప్ప ఇతరులెవరికీ అక్కరకు రావని మండిపడ్డారు. రాష్ట్రంలోని 80 లక్షల మహిళలకు ఏటా మూడు సిలిండర్లు బాబు ఇవ్వగలరా అని సవాల్ విసిరారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద తమ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 80 లక్షల మంది మహిళలకు రూ.25 వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. 

తాను ఎవరివద్దనైనా 15 శాతం కమిషన్ తీసుకున్నానేమో నిరూపించాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. రాజమండ్రిలో తాను చేసిన అభివృద్ధి.. 15 ఏళ్ల టీడీపీ పాలనలో జరిగినదానికంటే ఎక్కువని తేల్చి చెప్పారు. ఎవరినైనా విమర్శించే ముందు కాస్త ఆలోచించాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News