MS Dhoni: పరువు నష్టం దావా వేసిన మాజీ వ్యాపార భాగస్వాములు... విచారణ అర్హత లేదన్న ధోనీ

Dhoni urges Delhi High Court dismiss the defamation suit filed by his former business partners
  • గతంలో ఆర్కా స్పోర్ట్స్, ధోనీ మధ్య ఒప్పందం
  • దేశవ్యాప్తంగా ధోనీ పేరిట క్రికెట్ అకాడమీలు
  • ఫ్రాంచైజీ ఫీజులు, లాభాల్లో వాటా ఇస్తామన్న ఆర్కా స్పోర్ట్స్
  • రూ.15 కోట్లు ఎగ్గొట్టారంటూ క్రిమినల్ కేసు పెట్టిన ధోనీ
  • ధోనీ తమ పరువుకు నష్టం కలిగించాడన్న మిహిర్ దివాకర్, సౌమ్య 
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మాజీ వ్యాపార భాగస్వాములపై చాన్నాళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నాడు. ఓ ఒప్పందం విషయంలో మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్య తనను మోసం చేశారన్నది ధోనీ ఆరోపణ. ఆ మేరకు క్రిమినల్ కేసు దాఖలు చేశారు. 

అయితే, కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించకముందే, ధోనీ న్యాయవాది దయానంద్ శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమపై ఆరోపణలు చేశారని మిహిర్ దివాకర్, సౌమ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమపై నిందలు మోపి పరువుకు భంగం కలిగించారంటూ వారు ధోనీపై పరువునష్టం దావా వేశారు. 

దీనిపై స్పందించిన ధోనీ తన మాజీ వ్యాపార భాగస్వాములు దాఖలు చేసిన పరువునష్టం దావాకు విచారణ అర్హత లేదని స్పష్టం చేశాడు. ఆ దావాను కొట్టివేయాలని ఢిల్లీ హైకోర్టుకు తన న్యాయవాది ద్వారా విజ్ఞప్తి చేశాడు. 

మిహిర్ దివాకర్ కూడా గతంలో ఓ క్రికెటరే. 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సంస్థను స్థాపించి, ప్రముఖ క్రీడాకారుల క్రీడా వ్యవహారాలు, ఇతర ఒప్పందాలను పర్యవేక్షిస్తుండడం వంటి సేవలు అందించాడు. 

అప్పట్లో ధోనీ, ఆర్కా స్పోర్ట్స్ మధ్య కూడా ఒప్పందం కుదురింది. ధోనీ పేరుతో దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని, ఫ్రాంచైజీ ఫీజుల్లోనూ, లాభాల్లోనూ వాటా ఇస్తామని మిహిర్ దివాకర్, సౌమ్య అగ్రిమెంట్ లో పేర్కొన్నారు. 

అయితే, క్రికెట్ అకాడమీల ఫ్రాంచైజీ ఫీజులు, లాభాల్లో వాటాల రూపంలో తనకు రూ.15 కోట్లు ఎగ్గొట్టారంటూ మిహిర్ దివాకర్, సౌమ్యా దాస్ లపై ధోనీ న్యాయ పోరాటానికి దిగాడు. ఈ క్రమంలోనే మిహిర్ దివాకర్, సౌమ్య... ధోనీపై పరువునష్టం దావా వేశారు.
MS Dhoni
Mihir Diwakar
Soumya Das
Aarka Sports

More Telugu News