IPL: ఐపీఎల్ 'అధికారిక భాగస్వామి' కోసం బిడ్లు ఆహ్వానించిన బీసీసీఐ

BCCI invites bids for IPL Official Partner
  • ముందు రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ (ఆర్ఎఫ్ క్యూ) కొనుగోలు చేయాలన్న బోర్డు
  • దరఖాస్తు రుసుం రూ.5 లక్షలు
  • ఆర్ఎఫ్ క్యూ కొనుగోలుకు చివరి తేదీ ఫిబ్రవరి 19
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధికారిక భాగస్వామిగా వ్యవహరించాలని ఆశించే సంస్థలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆహ్వానం పలికింది. ఐపీఎల్ అధికారిక భాగస్వామ్యం హక్కులు కైవసం చేసుకునేందుకు బిడ్లు దాఖలు చేయాలని ఓ ప్రకటనలో కోరింది. 

ముందుగా.... దరఖాస్తు రుసుం చెల్లించినవారికి నియమ నిబంధనలు (టర్మ్స్ అండ్ కండిషన్స్), టెండరు విధానం, అర్హతా ప్రమాణాలు, బిడ్ల దాఖలు ప్రక్రియ విధానం, హక్కులు-బాధ్యతలు, ఇతర వివరాలతో కూడిన రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ (ఆర్ఎఫ్ క్యూ) డాక్యుమెంట్ ను అందిస్తామని వెల్లడించింది. దరఖాస్తు రుసుం రూ.5 లక్షలు అని ప్రకటించింది. ఈ రూ.5 లక్షల ఫీజు తిరిగి చెల్లించబడదు అని బీసీసీఐ స్పష్టం చేసింది. 

ఈ ఆర్ఎఫ్ క్యూ డాక్యుమెంట్ ను ఎలా పాందాలో తెలుసుకునేందుకు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొంది. అన్ని నియమ నిబంధనలను సంతృప్తి పరిచేలా వివరాలు పొందుపరిచిన వారినే బిడ్ కు అర్హులుగా పేర్కొంటామని బోర్డు స్పష్టం చేసింది. ఆర్ఎఫ్ క్యూ డాక్యుమెంట్ కొనుగోలుకు చివరి తేదీ ఫిబ్రవరి 19 అని వెల్లడించింది. 

ఏ దశలో అయినా, ఎలాంటి కారణం చెప్పకుండానే బిడ్డింగ్ ప్రక్రియను రద్దు చేసే అధికారం, సవరించే అధికారం బీసీసీఐకి ఉంటుందని స్పష్టం చేసింది.
IPL
Official Partner
Bids
RFQ
BCCI

More Telugu News