Shamar Joseph: ఎవరీ షామార్ జోసెఫ్?... 7 వికెట్లతో ఆసీస్ అంతు చూశాడు!

Shamar Joseph bundled Aussies as WI registers first win after 1997
  • బ్రిస్బేన్ లో పింక్ బాల్ టెస్టు
  • ఆస్ట్రేలియాను 8 పరుగుల తేడాతో ఓడించిన వెస్టిండీస్
  • రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ను కుప్పకూల్చిన షామార్
  • 1997 తర్వాత ఆస్ట్రేలియాను తొలిసారి ఓడించిన కరీబియన్లు

ప్రపంచ క్రికెట్లో 70, 80వ దశకాల్లో వెస్టిండీస్ జట్టు అంటే అరివీర భయంకరం అన్న ఒక్క మాట సరిపోతుంది. టెస్టులు, వన్డేలు... ఫార్మాట్ ఏదైనా కరీబియన్లు మిగతా జట్లపై తిరుగులేని ఆధిపత్యం కనబర్చేవారు. కానీ, 90వ దశకం నుంచి విండీస్ క్రికెట్ పతనం దిశగా సాగుతూ వస్తోంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ కు కనీసం అర్హత సాధించలేకపోవడం వారి పతనానికి పరాకాష్ఠ. 

అలాంటి జట్టు... టెస్టు చాంపియన్ షిప్ విజేత, వన్డే వరల్డ్ కప్ విజేత అయిన ఆస్ట్రేలియా జట్టును, అది కూడా ప్రత్యర్థి సొంతగడ్డపైనే ఓడించిందంటే ఎవరైనా నమ్మగలరా? కానీ, ఇది నిజం!.... బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరిగిన పింక్ బాల్ టెస్టులో క్రెయిగ్ బ్రాత్ వైట్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు 8 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై 21 ఏళ్ల తర్వాత విండీస్ సాధించిన తొలి విజయం ఇది. అందుకే ఈ గెలుపునకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 

ఈ విజయంలో కీలక భూమిక పోషించిన ఆటగాడు షామార్ జోసెఫ్. రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు తీసిన షామార్ జోసెఫ్ ఆసీస్ వెన్నువిరిచాడు. షామార్ జోసెఫ్... వెస్టిండీస్ జట్టులో ఇంతకు ముందెప్పుడూ వినని పేరు ఇది. ఎందుకంటే, షామార్ కు కెరీర్ లో ఇది రెండో టెస్టు మాత్రమే. 

ఈ సిరీస్ తోనే అంతర్జాతీయ క్రికెట్ గడప తొక్కిన ఈ 24 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ వెస్టిండీస్ కు భవిష్యత్ పై ఆశలు కల్పిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనూ షామార్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో సత్తా చాటాడు. 

షామార్ నిప్పులు చెరిగే పేసర్ మాత్రమే కాదు, ఆఖర్లో ఎంతో ఉపయుక్తమైన బ్యాట్స్ మన్ కూడా. అడిలైడ్ టెస్టులో 11వ వాడిగా దిగి 41 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News