Nirmala Sitharaman: మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును సమం చేయనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

Finance Minister Nirmala Sitharaman will equal former Prime Minister Morarji Desais record with the buget on February 1
  • అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిలవనున్న సీతారామన్
  • మొరార్జీ దేశాయ్‌తో సమంగా ఆరవసారి సమర్పణకు సిద్ధమైన ఆర్థికమంత్రి
  • ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం

ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌-2024ను ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరవసారి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌తో వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆమె నిలవనున్నారు. ఈ విషయంలో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌తో సమంగా సీతారామన్ నిలవనున్నారు. మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి అయిన సీతారామన్ ఇప్పటివరకు ఐదుసార్లు వార్షిక బడ్జెట్‌ సమర్పించారు. ఒకటో తారీఖున ప్రవేశపెట్టనున్న మధ్యంతర లేదా వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌తో ఆరు సార్లు ప్రవేశపెట్టినట్టు అవుతుంది. ఇప్పటివరకు అత్యధిక సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్ సిన్హా వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టగా వీరందరినీ సీతారామన్ అధిగమించనున్నారు.

కాగా మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959 - 1964 మధ్య కాలంలో 5 వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాగా 2024-25కు సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను సీతారామన్ సమర్పించనున్నారు. ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రభుత్వ వ్యయాల కోసం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యంతర బడ్జెట్‌లో విధానపరమైన ప్రకటనలు ఉండవు. అత్యవసర ఆర్థిక సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డాక జూన్‌ లేదా జులై నెలలో 2024-25 పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

  • Loading...

More Telugu News