Mallu Bhatti Vikramarka: ప్రత్యామ్నాయ విద్యుత్ అందించేందుకు వారు పునాదులు వేశారు: మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka on power issue
  • తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిపై దృష్టి సారించామని వెల్లడి
  • 2030 నాటికి డిమాండ్‍కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్న ఉపముఖ్యమంత్రి
  • గత ప్రభుత్వం విద్యుత్ రంగంపై రూ.81 వేల కోట్లకు పైగా అప్పు భారం మోపిందన్న మల్లు భట్టి
దేశంలో ప్రత్యామ్నాయ విద్యుత్‌‌ను అందించేందుకు దివంగత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు పునాదులు వేశారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వారు వేసిన పునాదులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలు తీరుస్తున్నాయన్నారు. 

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందనవెళ్లి గ్రామంలో ఓ సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఈ కంపెనీ వృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

2030 సంవత్సరం నాటికి డిమాండ్‍కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిని చేస్తామన్నారు. మానవజాతికి, విద్యుత్ శక్తికి మధ్య బంధం విడదీయరానిదన్నారు. విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని... అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికతో సౌర శక్తి, పవన శక్తి, హైడల్, చెత్త నుంచి తయారు చేసే విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తిని పెంచి ప్రజల అవసరాలు తీరుస్తామని తెలిపారు. విద్యుత్ రంగంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.81 వేల కోట్లకు పైగా అప్పు భారం మోపిందని మండిపడ్డారు. వీటిని అధిగమించి ముందుకు సాగాల్సి ఉందన్నారు.
Mallu Bhatti Vikramarka
Telangana
Congress

More Telugu News