Akhilesh Yadav: 'బీజేపీతో నితీశ్ కుమార్ జత' అంటూ కథనాలు... అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Nitish Kumar can be INDIA bloc PM candidate says Akhilesh Yadav
  • నితీశ్ కుమార్ I.N.D.I.A. కూటమిలోనే కొనసాగితే ప్రధాని కావొచ్చన్న అఖిలేశ్ యాదవ్
  • నితీశ్ చొరవ తీసుకొని కూటమిని ఏర్పాటు చేశారన్న ఎస్పీ అధినేత
  • ప్రాంతీయ పార్టీలకు బలమున్న చోట వారికే అవకాశమివ్వాలని కాంగ్రెస్‌కు సూచన
నితీశ్ కుమార్ బీజేపీతో జత కడతారనే ప్రచారం నేపథ్యంలో సమాజ్‍వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ I.N.D.I.A. కూటమిలోనే కొనసాగితే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. అఖిలేశ్ యాదవ్ శుక్రవారం ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ... మా కూటమిలో ప్రధానిమంత్రిగా ఎవరినైనా పరిగణించే అవకాశాలు ఉంటాయన్నారు. కాబట్టి నితీశ్ కుమార్ కూడా రేసులో ఉంటారన్నారు.

ఇక్కడ మరో అంశం ఏమంటే.. ఇటీవల నితీశ్ కుమార్ I.N.D.I.A. కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించారు. దీనిపై జేడీయూ నాయకుడు సంజయ్ కుమార్ మాట్లాడుతూ... కూటమి కన్వీనర్‍గా కాంగ్రెస్ నుంచి మాత్రమే ఉండాలని నితీశ్ కోరుకున్నారని... అందుకే ఆ పదవిని తిరస్కరించారని తెలిపారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి లేదా ఎన్డీయేకు వ్యతిరేకంగా 26 నుంచి 28 రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఈ కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తాము తమ తమ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇప్పుడు నితీశ్ కుమార్ I.N.D.I.A. కూటమికి గుడ్‍పై చెప్పి... ఎన్డీయేలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ మద్దతుతో జనవరి 28న నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చునని జోరుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో I.N.D.I.A. కూటమిలోనే కొనసాగాలని నితీశ్ కుమార్‍‌కు అఖిలేశ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. నితీశ్ కుమార్ ఎంతో చొరవ తీసుకొని ఈ కూటమిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కూటమి విషయంలో కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని సూచించారు. తాను ప్రధానమంత్రి పదవికి పోటీ పడటం లేదని... అదే సమయంలో ప్రాంతీయ పార్టీలకు బలం ఎక్కువ ఉన్నచోట కాంగ్రెస్ ఆ పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అఖిలేశ్ యాదవ్ సూచించారు.
Akhilesh Yadav
Congress
Rahul Gandhi
Nitish Kumar

More Telugu News