Twins: పుట్టినప్పుడే విడిపోయి 19 ఏళ్ల తర్వాత కలిసిన కవలలు

Identical twins met after 19 years after their birth in Georgia
  • జార్జియాలో ఆసక్తికర ఉదంతం
  • పురిట్లోనే కవలలను అమ్మేసిన తండ్రి
  • చెరో ఇంట పెరిగిన అమీ, అనో
  • ఇద్దరినీ కలిపిన టాలెంట్ షో, టిక్ టాక్ వీడియో
జార్జియా దేశంలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. కొన్ని పరిస్థితుల కారణంగా పుట్టినప్పుడే విడిపోయిన ఇద్దరు కవల బాలికలు ఆశ్చర్యకరంగా 19 ఏళ్ల తర్వాత కలిశారు. అచ్చం ఒకేలా ఉండే ఈ కవలల పేర్లు అమీ క్విటియా, అనో సర్టానియా. వీరిద్దరినీ కలిపింది... ఓ టిక్ టాక్ వీడియో, ఓ టాలెంట్ షో! 1972లో బాలీవుడ్ లో విడుదలైన సీతా ఔర్ గీతా సినిమాకు వీరి జీవితానికి దగ్గరి పోలికలు ఉన్నాయి. 

అసలేం జరిగిందంటే... గోచా గఖారియా, అజా షోని దంపతులు 2002లో తల్లిదండ్రులయ్యారు. అయితే అజా షోని ఇద్దరు కవలలకు జన్మనిచ్చే సమయంలో తీవ్ర అనారోగ్యకర పరిస్థితుల నడుమ కోమాలోకి వెళ్లిపోయింది. దాంతో, తన కవల బిడ్డలను గోచా రెండు వేర్వేరు కుటుంబాలకు అమ్మేశాడు. 

అనో సర్తానియా తిబ్లిసి ప్రాంతంలో పెరగ్గా, అమీ క్విటియా జుగ్దిది ప్రాంతంలో పెరిగి పెద్దదైంది. తాము కవలలం అని, చెరొక చోట పెరుగుతున్నాం అని వారిద్దరికీ ఏమాత్రం తెలియదు. 11 ఏళ్ల వయసున్నప్పుడు ఇద్దరూ ఓ డ్యాన్స్ కాంటెస్ట్ లో పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరిని చూసినవారు ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారే అని విస్మయానికి గురయ్యారు. 

ఆ తర్వాత జార్జియా గాట్ టాలెంట్ అనే టీవీ కార్యక్రమంలో అచ్చం తనలానే ఉన్న అమ్మాయి (అనో)ని చూసి అమీ దిగ్భ్రాంతికి గురైంది. దాంతో అనో గురించి తెలుసుకోవాలన్న తపన అమీలో మొదలైంది. 

అటు, అనో సోషల్ మీడియాలో ఓ టిక్ టాక్ వీడియో చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. అచ్చం తనలాగే ఉన్న అమ్మాయి (అమీ) ఆడిపాడుతోంది. దాంతో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి అనోలో మొదలైంది. 

ఆ తర్వాత అనేక ప్రయత్నాల మీదట ఈ కవలలు తమ 19వ ఏట ఒకరినొకరు కలుసుకుని తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. 

జార్జియాలోని ఆసుపత్రుల్లో వేలాది మంది శిశువులు మాయం కావడం, పేదరికం కారణంగా పుట్టిన బిడ్డలను పురిట్లోనే అమ్ముకోవడం సాధారణమైన విషయం. అమీ, అనో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే తల్లి ఒడికి దూరమై చెరో ఇంట పెరిగారు. 

ఇలాంటి వేలాది శిశువులపై బీబీసీ చానల్ తాజాగా ప్రత్యేక కార్యక్రమం కూడా రూపొందించింది. అందులోనే అమీ, అనోల గాథను కూడా చూపించడంతో అందరికీ వీళ్ల గురించి తెలిసింది.
Twins
Amy Khvitia
Ano Sartania
Georgia

More Telugu News