Perni Nani: పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించడంపై పేర్ని నాని స్పందన

Perni Nani take a dig at Pawan Kalyan who announced two candidates
  • ఇవాళ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన పవన్ 
  • ఇదొక కొత్త డ్రామా అంటూ పేర్ని నాని విమర్శలు
  • మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా ఆడుతున్నారంటూ ఫైర్
  • పవన్ పౌరుషవంతుడైతే కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్
జనసేనాని పవన్ కల్యాణ్ రిపబ్లిక్ డే రోజున ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 

"చంద్రబాబుకేనా ఉండేది ఒత్తిళ్లు... నాపైనా ఒత్తిళ్లు ఉంటాయి... ఆయన ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తే, నేను కూడా ఇద్దరిని ప్రకటిస్తున్నా... ఆర్ అనే అక్షరం బాగుంది కదా... రిపబ్లిక్ డేలో మొదటి అక్షరం... అందుకే ఇవాళ రాజోలు, రాజానగరం అభ్యర్థులను ప్రకటిస్తున్నా" అంటూ పవన్ కల్యాణ్ వెల్లడించారు. గత ఎన్నికల్లో జనసేన తరఫున ఒకే ఒక్కడు 'రాపాక వరప్రసాద్' గెలిచింది కూడా రాజోలు నియోజకవర్గం నుంచే. 

ఇక, పవన్ రాజోలు, రాజానగరం అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో... వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ఈ అభ్యర్థుల ప్రకటన ఒక మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని విమర్శించారు. చంద్రబాబు, పవన్ ల రాజకీయ డ్రామాలతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని, ప్రజలు నవ్వుకుంటున్నప్పటికీ వాళ్లు మరో కొత్త డ్రామాను తెరపైకి తెచ్చారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. 

"గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు రాజోలు, రాజానగరం నియోజకవర్గాలకు టీడీపీ ఇన్చార్జిలే లేరు. ఆ రెండు  నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకు వదిలేశాడు. ఆ విధంగా కేటాయించిన సీట్లనే పవన్ నేడు ప్రకటించాడు. జనసేన కార్యకర్తల్లో తనపైనా, పార్టీ నేతలపైనా వస్తున్న వ్యతిరేకతను చల్లార్చే ప్రయత్నంలో భాగంగానే పవన్ నేడు అభ్యర్థుల ప్రకటన చేశారు. తానంటేనే మండిపడుతున్న జనసైనికులను జోకొట్టడానికి పవన్ ఆడుతున్న డ్రామా ఇది. పవన్ కల్యాణ్ అంత పౌరుషవంతుడే అయితే విశాఖ, తిరుపతి, కాకినాడ వంటి స్థానాలకు అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు? దీన్నిబట్టే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని అర్థమవుతోంది" అంటూ పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు.
Perni Nani
Pawan Kalyan
Candidates
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News