Undavalli Arun Kumar: వైఎస్ లోని ఆ లక్షణం షర్మిలకు జన్యుపరంగా సంక్రమించిందేమో అనిపించింది: ఉండవల్లి

  • రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ నివాసానికి వచ్చిన షర్మిల
  • ఉండవల్లిని వివరాలు అడిగిన మీడియా సిబ్బంది
  • షర్మిల మర్యాదపూర్వకంగానే కలిసిందని వెల్లడి
  • పాత సంగతులు మాట్లాడుకున్నామని వివరణ
Undavalli Arun Kumar talks to media after meeting with YS Sharmila

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిశారు. ఈ భేటీ అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ ను మీడియా పలకరించింది. షర్మిల మీతో ఏం మాట్లాడారు? కాంగ్రెస్ లోకి రమ్మన్నారా? సోనియా గాంధీ నుంచి ఏమైనా కబురు తెచ్చారా? అని మీడియా ప్రతినిధులు ఉండవల్లిని ప్రశ్నించారు. అందుకు ఉండవల్లి బదులిచ్చారు. 

"ఇవాళ రాజమండ్రి వచ్చిన షర్మిల నన్ను కలిసింది. మా మధ్య జరిగింది మర్యాదపూర్వక సమావేశమే. పాత సంగతుల గురించి మాట్లాడుకున్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటి సంగతులు గుర్తుచేసుకున్నాం. అప్పట్లో నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. వాళ్లింటికి వెళ్లినప్పుడు జగన్ తో కొన్నిసార్లు మాట్లాడాను కానీ, అప్పట్లో షర్మిలతో మాట్లాడింది పెద్దగా లేదు. మొదటిసారిగా, ఇవాళ షర్మిలతో ఎక్కువసేపు మాట్లాడాను. ఓ ముసలివాడ్ని చిన్న పిల్ల కలిసినట్టు అనిపించింది. 

షర్మిలతో మాట్లాడాక నాకు ఒక విషయం అర్థమైంది. ఆమె రాజకీయాల్లో చాలా ఎత్తుకు ఎదుగుతుంది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఎలాంటి వాళ్లనైనా సమ్మోహితులను చేసేవారు. రాజశేఖర్ రెడ్డితో పది నిమిషాలు మాట్లాడితే చాలు... ఇలాంటి వ్యక్తినా మనం తప్పుబట్టింది అనిపించేది. షర్మిల కూడా అలాగే అనిపించింది. బహుశా ఆ లక్షణం రాజశేఖర్ రెడ్డి నుంచి షర్మిలకు జన్యుపరంగా సంక్రమించిందేమో" అని వివరించారు. 

ఇక, సహజంగానే ఎవరైనా కలిసినప్పుడు పార్టీలోకి రావొచ్చు కదా అంటారని, గతంలో జగన్ కూడా రమ్మన్నాడని, షర్మిల కూడా మినహాయింపు కాదని ఉండవల్లి పేర్కొన్నారు. తాను గత పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా, హాయిగా ఉన్నానని తెలిపారు. షర్మిల భర్త అనిల్ కూడా తన ఇంటికి రెండుసార్లు వచ్చాడని, కుమారుడి పెళ్లికి కూడా పిలిచారని వివరించారు. 

ప్రజాపాలన అంటే దేశంలో కాంగ్రెస్ తర్వాతనే అని ఉండవల్లి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో కొందరు అవినీతికి పాల్పడి ఉండొచ్చు, కొన్ని స్కాములు చోటుచేసుకుని ఉండొచ్చు... కానీ, సంక్షేమ ఫలాలను ప్రజల వరకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ కు ఉన్న సమర్థత దేశంలో మరే పార్టీకి లేదని అన్నారు. 

ఏపీలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని... ప్రత్యేక హోదా, పోలవరం తీసుకువస్తే ఏపీలో కాంగ్రెస్ కు పునర్ వైభవం వస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

More Telugu News