YS Sharmila: నాన్న వైఎస్సార్ పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడు: వైఎస్ షర్మిల

Jagan spoiled our father YS Rajasekhar Reddy name says YS Sharmila
  • వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదన్న షర్మిల
  • ఐదేళ్ల పాలనలో ఏపీని నాశనం చేశాడని మండిపాటు
  • నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నాడని విమర్శ
ఏపీ ముఖ్యమంత్రి, తన అన్న జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదని ఆమె అన్నారు. సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని చెప్పారు. రాజశేఖరరెడ్డి పాలనకు, జగన్ పాలనకు పొంతనే లేదని అన్నారు. నాన్న పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశాడని అన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టం చేసినా... ప్రజలకు మేలు చేస్తాడని భరించానని... అయినా అలా జరగలేదని మండిపడ్డారు. 

పోలవరం ప్రాజెక్ట్ అనేది వైఎస్సార్ కల అని షర్మిల చెప్పారు. 1941లోనే దాన్ని నిర్మించాలనుకున్నప్పటికీ ఏ నాయకుడు సాహసం చేయలేదని అన్నారు. వైఎస్సార్ సీఎం అయిన 6 నెలల్లోనే పోలవరం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పై జగన్ ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. 2021లో పోలవరంను పూర్తి చేస్తానని చెప్పిన జగన్... ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. వైఎస్ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగైతే... ఇప్పుడు దండగ అని అన్నారు. 

జగన్ ఒక నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నారని షర్మిల విమర్శించారు. ఎమ్మెల్యేలకు కూడా ఆయన కనిపించరని దుయ్యబట్టారు. ఎంతో మంది కష్టపడి, త్యాగాలు చేస్తేనే జగన్ సీఎం అయ్యాడని చెప్పారు. పక్కన ఉన్న అందరినీ దూరం చేసుకుంటున్నాడని అన్నారు. వైఎస్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మందిని మంత్రులను చేశాడని ప్రశ్నించారు.
YS Sharmila
Congress
YS Rajasekhar Reddy
Jagan
YSRCP

More Telugu News