Hrithik Roshan: గల్ఫ్‌లో హృతిక్ రోషన్ ఫ్యాన్స్‌కి నిరాశ... కేవలం ఒకే దేశంలో ‘ఫైటర్’ మూవీ విడుదల

Bad news for Hrithik Roshan fans staying in the Gulf as Fighter movie released in only in UAE
  • ‘ఫైటర్’ సినిమా విడుదలకు యూఏఈ సెన్సార్ బోర్డు అనుమతి
  • క్లియరెన్స్ ఇవ్వని మిగతా గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డులు
  • రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ‘ఫైటర్ మూవీ’

బాలీవుడ్ స్టార్ నటులు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిన మూవీ ‘ఫైటర్’ రేపటి (గురువారం) నుంచి థియేటర్లలో సందడి చేయబోతోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. హృతిక్, దీపిక జోడీని తొలిసారి భారీ స్క్రీన్‌లపై చూసేందుకు ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ విషయంలో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ఫ్యాన్స్‌కి బ్యాడ్‌న్యూస్ వచ్చింది. యూఏఈ మినహా గల్ఫ్‌లో మరే దేశంలోనూ ‘ఫైటర్’ సినిమా విడుదల కావడం లేదు. భారీ యాక్షన్‌తో రూపొందించిన ‘ఫైటర్’ సినిమా విడుదలకు యూఏఈ సెన్సార్ అధికారులు ‘పీజీ15’ (Parental Guidance) అనుమతి ఇచ్చారు. 

మిగతా గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డులు ఈ సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇవ్వలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ‘ఫైటర్’ మూవీ విఫలమైందని తెలిపాయి. దీంతో ఆయా దేశాల్లో ఈ సినిమా విడుదల కోసం నిరీక్షించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. యూఏఈ మినహా ఇతర గల్ఫ్ దేశాలలో ‘ఫైటర్’ విడుదలకు అనుమతి లభించలేదని  సినిమా ట్రేడ్ అనలిస్ట్, నిర్మాత గిరీష్ జొహార్ తెలిపారు.

కాగా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ‘ఫైటర్’ మూవీ సంచలనాలు సృష్టిస్తోంది. మొదటి రోజుకి సంబంధించి 1,60,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు రూ. 5 కోట్లకు పైగా వసూలు అయ్యాయి. టికెట్ బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో లెక్కలను చూస్తే  ఫైటర్ సినిమా 2024లో మొదటి బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, అజీజ్, అమీర్ నాయక్‌తో పాటు పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News