Gutha Sukender Reddy: అయోధ్య అంశం తర్వాత బీజేపీకి ఓట్లు పెరిగే అవకాశముంది: గుత్తా సుఖేందర్ రెడ్డి

  • బీజేపీకి రెండు శాతం నుంచి మూడు శాతం ఓట్లు పెరిగే అవకాశముందన్న గుత్తా  
  • అధిష్ఠానం ఆదేశిస్తే తన కొడుకు అమిత్ రెడ్డి.. సోనియాగాంధీపై పోటీ చేస్తారని స్పష్టీకరణ
  • బీఆర్ఎస్‌లో కంఫర్ట్‌గా ఉన్నానని... పార్టీ మారాల్సిన అవసరం లేదన్న గుత్తా
Gutha Sukender Reddy says BJP may secure more votes after Ayodhya

అయోధ్య అంశం తర్వాత బీజేపీకి కొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు  శాతం మేర ఓట్లు పెరిగే అవకాశముందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను చూసే ఓటు వేస్తారన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే తన కుమారుడు అమిత్ రెడ్డి పోటీ చేస్తారన్నారు. భువనగిరి, నల్గొండ ఎక్కడ టికెట్ ఇచ్చినా అమిత్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అలా కాకుండా, ఒకవేళ అధిష్ఠానం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కూడా వారి గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

నల్గొండ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే అక్కడి నుంచి తన కొడుకు అమిత్ రెడ్డి ఆమెపై పోటీ చేస్తారన్నారు. ఇందిరా గాంధీ మీద జైపాల్ రెడ్డి పోటీ చేసిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేఆర్ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పోవడంతో తెలంగాణ ప్రయోజనాలకు భారీ నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ

తాను బీఆర్ఎస్ పార్టీలో చాలా కంఫర్ట్‌గా ఉన్నానని... పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో లేదని... ఇలాంటి కష్టకాలంలో క్యాడర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన మా పార్టీకి చెందిన మంత్రులు కూడా భారీ తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. ఓటమికి వ్యక్తులు కారణం కాదన్నారు.

More Telugu News