Prudhvi: నేను చంద్రబాబు, పవన్ వదిలిన బాణం.. కాంగ్రెస్ వదిలిన బాణం షర్మిల: సినీ నటుడు పృథ్వి

  • సినిమా వసూళ్ల గురించి మాట్లాడేవాళ్లు కూడా మంత్రులేనా అని ప్రశ్నించిన పృథ్వి
  • పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ఆగిపోయిందా అని ఎద్దేవా
  • షర్మిల వల్ల వైసీపీకి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్య
Actor Prudhvi fires on YSRCP

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సినీ నటుడు, సినీ నటుడు పృథ్వి స్పష్టం చేశారు. తాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని అని చెప్పారు. మార్చి నెలలో ఎన్నికల ప్రచారానికి వస్తానని తెలిపారు. డ్యాన్సులు, సినిమాలు, సినిమా కలెక్షన్లు, డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడేవాళ్లు కూడా మంత్రులేనా? అని ఎద్దేవా చేశారు. 


ప్రాజెక్టుల గురించి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుకు ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. ఈ అంబటి రాంబాబు ఎప్పుడు చూసినా మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓటమి గురించే మాట్లాడతాడని విమర్శించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు తనను వాడుకుని వైసీపీ వదిలేసిందని... త్వరలోనే వీళ్లకు సమాధానం చెపుతానని అన్నారు. 

వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన బాణం అని పృథ్వి అన్నారు. షర్మిల కారణంగా వైసీపీకి ఇబ్బందులు తప్పవని చెప్పారు. 136 సీట్లతో టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు 136 స్థానాలను గెలుచుకుంటాయని చెప్పారు. 175 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడెందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల స్థానాలను మార్చినంత మాత్రాన ప్రజలు ఓటు వేయరని అన్నారు.

More Telugu News