ఐక్యరాజ్య సమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై ఎలాన్ మస్క్ స్పందన
- ఆఫ్రికా ఖండం నుంచి ఒక్క దేశానికీ శాశ్వత సభ్యత్వం లేదని గుటెర్రస్ విచారం
- భారతదేశం సంగతేంటంటూ ట్విట్టర్ లో ప్రశ్నించిన వ్యాపారవేత్త ఐసెన్ బర్గ్
- భారత్ కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమన్న మస్క్
- ఐరాస అనుబంధ సంస్థలలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య
అంతకుముందు గుటెర్రస్ ఓ ట్వీట్ చేస్తూ.. భద్రతా మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి ఒక్క దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ ట్వీట్ పై ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ మైఖేల్ ఐసెన్ బర్గ్ స్పందిస్తూ.. మరి భారత దేశం సంగతేంటని గుటెర్రస్ ను ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితిని పూర్తిగా రద్దు చేసి, సరికొత్త నాయకత్వంతో, ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మరో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని ఐసెన్ బర్గ్ సూచించారు. ఈ చర్చలో ఎలాన్ మస్క్ కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భూమి మీద అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరించిన భారత్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అయితే, తమకు మాత్రమే ఉన్న అధికారాన్ని వదులుకోవడానికి కొంతమంది ఇష్టపడరని, ఇదే సమస్యలకు కారణమవుతుందని మస్క్ ట్వీట్ చేశారు.