Chandrababu: అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: చంద్రబాబు

  • ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన అంగన్వాడీలు
  • అర్థరాత్రి దీక్షను భగ్నం చేసిన పోలీసులు
  • ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగడం దారుణమన్న చంద్రబాబు
  • జగన్ అహాన్ని పక్కనబెట్టి అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని సూచన
Chandrababu condemns govt actions on Anganwadi workers

ఛలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో, విజయవాడ ధర్నాచౌక్ వద్ద అర్థరాత్రి వేళ అంగన్వాడీల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంగన్వాడీలను అక్కడ్నించి బలవంతంగా తరలించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. 

అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై రోడ్డెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగడం దారుణమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తన సహజసిద్ధమైన వేధింపులు, కక్ష సాధింపు పద్ధతులను అంగన్వాడీలపైనా ప్రయోగించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం అని చంద్రబాబు విమర్శించారు. 

నిరసనలను అణచివేయడం, అనైతిక పద్ధతిలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కంటే, ఆ సమయాన్ని సమస్య పరిష్కారంపై పెడితే ఇప్పటికే ఫలితం వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి తన అహాన్ని పక్కనబెట్టి అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News