Budda Venkanna: లోకేశ్ ది తన స్థాయి కాదన్న కేశినేని నానికి బుద్ధా వెంకన్న కౌంటర్

Budda Venkanna counters Kesineni Nani remarks on Chandrababu and Lokesh
  • చంద్రబాబు, లోకేశ్ లపై కేశినేని నాని విమర్శలు
  • లోకేశ్ గడ్డంలోని వెంట్రుక స్థాయి చేయవు నువ్వు అంటూ బుద్ధా ఫైర్
  • సిగ్గుండాలి నీ ముఖానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు
  • స్థాయి గురించి నువ్వా మాట్లాడేది అంటూ ఆగ్రహం
రాజకీయాల్లో చంద్రబాబు స్థాయి, తన స్థాయి ఒకటేనని... లోకేశ్ ది తనకంటే తక్కువ స్థాయి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. నాని వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. 

"లోకేశ్ బాబుది నీ స్థాయి కాదా? లోకేశ్ బాబు గడ్డంలోని వెంట్రుక పీకితే, ఆ వెంట్రుక స్థాయి కూడా కాదు నీది. కుప్పం నుంచి వైజాగ్ వరకు పాదయాత్ర చేస్తే... రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల మందిలో రెండు కోట్ల మంది ఆయనతో పాటు అడుగులో అడుగువేసి నడిచారు... అదీ లోకేశ్ సత్తా! ఎన్నికల్లో గెలవలేదని అంటున్నావ్... ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అంతటివాళ్లు కూడా ఓడిపోయారు. ప్రజాదరణను గెలుపోటములతో కొలవలేం. రేపు నువ్వు గెలువు చూద్దాం! 

నీ దెబ్బకు ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యేలు పోటీ చేయబోమంటున్నారు. బాబోయ్... వీడ్ని తీసుకువచ్చి మాకు తగిలించారేంటని జగన్ తో మొరపెట్టుకుంటున్నారు. అందుకే మొన్న పూల బొకే ఇస్తే జగన్ పక్కకి తోసేశాడు. అదీ ఇతడి నైజం! 

ఇతను అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు చేసే విమర్శలు ఎవరి మీద? నువ్వు ఎవరిని విమర్శిస్తున్నావో చెప్పు.. వాళ్లే వచ్చి మాట్లాడతారు. అందులో నిజాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా ప్రజలకు కూడా తెలియాలి కదా! 

స్థాయి గురించి నువ్వా చెప్పేది... మా కేశినేని చిన్ని నందిగామ వెళితే వేలాది మంది ఆయనతో నడిచారు... నిన్న నువ్వు నందిగామ వెళితే పది మంది కూడా లేరు. ఆ పది మంది కూడా వైసీపీ వాళ్లే. నువ్వు టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు నీవెంట టీడీపీ సానుభూతిపరులు, టీడీపీ నేతలు నడిచారన్నది నిజమే. అది చంద్రబాబు ఘనత. కానీ నువ్వు బయటికి వెళ్లగానే ఒక్కరూ నీ వెంట నడవలేదే... నువ్వా మాట్లాడేది! సిగ్గుండాలి నీ ముఖానికి!" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్లోనే కొన్ని ఉల్లిపాయ బాంబులు పేల్చారు. ఉల్లిపాయ బాంబులు పేలితే పారిపోయేవాళ్లు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. వీళ్లకు కడప బాంబులు కూడా అక్కర్లేదు... ఉల్లిపాయ బాంబులు చాలు... వీళ్ల సంగతి మాకు తెలుసు కదా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. రేపు ఎన్నికల్లో చూసుకుందాం... జగన్ మోహన్ రెడ్డి తాత వచ్చినా సరే... విజయవాడలో టీడీపీ వాళ్ల వెంట్రుక కూడా పీకలేరు అంటూ బుద్ధా వ్యాఖ్యానించారు.
Budda Venkanna
Kesineni Nani
TDP
Chandrababu
Nara Lokesh
Jagan
Vijayawada
YSRCP
Andhra Pradesh

More Telugu News