K Kavitha: అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతీరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ కవిత

  • పూలే విగ్రహ ఏర్పాటు కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు వినతిపత్రం అందజేత
  • ఆధునిక భారత దేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడంటూ పూలేపై కవిత ప్రశంస
  • మహోన్నతమైన పూలే వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని వెల్లడి 
Kavitha asks for setting up of jyothirao phule statue in assembly premises

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆధునిక భారత దేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు పూలే కృషి చిరస్మరణీయమన్నారు. ఈ మేరకు  కవిత ఆదివారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. అణగారిన వర్గాలు, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులని కొనియాడారు. వివక్షకు గురైన వర్గాల గుడిసెల్లో అక్షర దీపాలు వెలిగించిన కాంతిరేఖ పూలే అని వ్యాఖ్యానించారు. 


మహోన్నతమైన పూలే వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని కవిత చెప్పారు. పూలేను తన గురువుగా అంబేద్కర్ ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. ఉన్నతమైన, ఉదాత్తమైన ప్రజాస్వామిక భావనలు చట్టసభల్లో నిరంతరం ప్రతిఫలించాలనే ఉద్దేశంతో మహనీయుల విగ్రహాలు ఆ ప్రాంగణంలో నెలకొల్పడం గొప్ప ఆదర్శమని అన్నారు. గతంలో జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డా.అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. ఇది అందరికీ గర్వకారణమని చెప్పారు. సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహ ఏర్పాటు కూడా తెలంగాణ అసెంబ్లీలో జరగడం అవసరమన్నారు.

More Telugu News