Nara Lokesh: జగన్ నియంతపాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి: నారా లోకేశ్

  • ఏపీలో డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న అంగన్వాడీలు
  • 40 రోజులుగా సమ్మె
  • అంగన్వాడీలకు టీడీపీ మద్దతు
  • తాజాగా ప్రకటన విడుదల చేసిన నారా లోకేశ్
Nara Lokesh extends support to AP Anganwadi workers

ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయక సిబ్బంది 40 రోజులుగా సమ్మె  చేస్తున్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్లతో అంగన్వాడీలు సమ్మె బాటపట్టారు. అంగన్వాడీలకు టీడీపీ మద్దతు పలుకుతోంది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అంగన్వాడీలను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. 

జగన్ నియంతపాలనలో అంగన్వాడీ చెల్లెమ్మలు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. 

"రాజులు, రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక తొలిసారిగా సుమారు అయిదేళ్ల క్రితం ఏపీ ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే నయా నియంతకు అధికారమిచ్చారు. ఆయన అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను కష్టాలకు గురిచేస్తున్నాడు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ 40 రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే కనీస స్పందన లేకపోగా, విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలు పీకేస్తామని తన పాలేరు సజ్జలతో బెదిరింపులకు దిగుతున్నాడు. 

ప్రభుత్వ అనాలోచిత, మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. జగన్ అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారబోతోంది. ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్... మరో 3 నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయం. 

ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరిపోకుండా న్యాయమైన డిమాండ్ల సాధనకు 40 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. టీడీపీ-జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని నేను మాట ఇస్తున్నాను" అంటూ లోకేశ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News