Ayodhya Ram Mandir: ముఖేశ్ అంబానీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు.. అయోధ్య టాప్ గెస్టులు వీరే!

  • ఈ నెల 22న అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక
  • వివిధ రంగాలకు చెందిన 8 వేల మందికి ఆహ్వానం
  • వ్యాపార దిగ్గజాలు, సెలబ్రిటీలతో నిండిపోయిన జాబితా
Guest list of Ayodhya Ram temple filled with celebrities

ప్రస్తుతం యావత్ దేశం శ్రీరాముడి భక్తిభావంతో నిండిపోయింది. శ్రీరాముడి నామస్మరణతో దేశం మారుమోగుతోంది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన దాదాపు 8 వేల మంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. వీరిలో పలువురు సాధువులు, పీఠాధిపతులు కూడా ఉన్నారు. మరోవైపు ఆహ్వానితుల జాబితా దేశంలోని అత్యంత ప్రముఖులు, సెలబ్రిటీలతో నిండిపోయింది.  

ఈ కార్యక్రమానికి పిలిచిన వివిధ రంగాల ఆహ్వానితులను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేశారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అయోధ్యకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ముంబై నుంచి ఆయన ఒక ప్రైవేట్ చార్టెర్డ్ ప్లేన్ లో రానున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుల్లో అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి, అల్లు అర్జున్, మోహన్ లాల్, రామ్ చరణ్, అనుపమ్ ఖేర్, రజనీకాంత్, ధనుష్, కంగనా రనౌత్, అలియా భట్, రణబీర్ కపూర్, మాధురీ దీక్షిత్, హేమమాలిని, శంకర్ మహదేవన్, సన్నీ డియోల్, ఇళయరాజా, రిషభ్ శెట్టి, సరోద్ వాద్యకారుడు అంజాద్ అలీ, దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ, చంద్రప్రకాశ్ ద్వివేదీ తదితరులు ఉన్నారు. 

పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాల విషయానికి వస్తే... ముఖేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోక, కాబోయే కోడలు రాధికా మర్చెంట్ లతో అయోధ్యకు వెళ్తున్నారు. వీరితో పాటు గౌతమ్ అదానీ, కుమార్ మంగళం బిర్లా, అజయ్ పిరమళ్, ఆనంద్ మహీంద్రా, జీ ఎంటర్టైన్ మెంట్ సీఈఓ పునీత్ గోయెంకా, టీసీఎస్ సీఈవో కృతివాసన్, డాక్టర్ రెడ్డీస్ కి చెందిన సతీశ్ రెడ్డి, భారత్ బయోటెక్ కృష్ణా ఎల్లా, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, యశోదా హాస్పిటల్స్ ఛైర్మన్ దేవేందర్ రావు తదితరులు అయోధ్యకు వెళ్తున్నారు. చిన్నజీయర్ స్వామి కూడా అయోధ్య వేడుకకు వెళ్లనున్నారు.

రాజకీయ ప్రముఖుల్లో లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, చంద్రబాబు, కేసీఆర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, సీఎంలు తదితర ప్రముఖులు ఉన్నారు. క్రీడాకారుల్లో కోహ్లీ, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్ తదితరులకు ఆహ్వానాలు అందాయి. ప్లానింగ్ కమిషన్ మాజీ ఛైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ సీజేఐలు, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ తదితర ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

More Telugu News