Raja Singh: 500 నోటుపై రాముడి ఫొటో ముద్రించాలి.. ఇది 100 కోట్ల హిందువుల డిమాండ్: రాజాసింగ్

BJP MLA Raja Singh demands to print Lord Sri Ram photo on Rs 500 notes
  • థాయిలాండ్, అమెరికా, ఇండొనేషియా కరెన్సీపై హిందూ దేవతల ఫొటోలు ఉన్నాయన్న రాజాసింగ్
  • హిందువులు ఎంతో భక్తితో కొలిచే రాముడి ఫొటోను మన కరెన్సీపై ముద్రించాలని డిమాండ్
  • మహారాష్ట్రలో వక్ఫ్ భూములు 10 లక్షల ఎకరాలకు చేరుకున్నాయని ఆందోళన

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. రూ. 500 నోటుపై రాముడి బొమ్మను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆయన తనదైన శైలిలో వాదనను వినిపించారు. థాయిలాండ్, అమెరికా, ఇండొనేషియాలతో పాటు యూరోప్ లోని కొన్ని దేశాలు తమ నోట్లపై హిందూ దేవతల ఫొటోలను ముద్రించాయని గుర్తు చేశారు. 80 శాతం ముస్లిం జనాభా ఉన్న ఇండొనేషియా వారి కరెన్సీపై హిందూ దేవతలను ముద్రించడాన్ని గమనించాలని కోరారు. 

మన దేశంలో కోట్లాది మంది హిందువులు రాముడిని ఎంతో భక్తితో కొలుస్తారని... అలాంటప్పుడు ఆయన ఫొటోను రూ. 500 నోట్లపై ముద్రించాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ చెప్పారు. ఇది తనొక్కడి డిమాండ్ మాత్రమే కాదని... దేశంలోని 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని అన్నారు. మహారాష్ట్రలోని శంభాజీ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

దేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములను వెంటనే విడుదల చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోనే 10 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ కింద ఉందని చెప్పారు. 2009 వరకు 4 లక్షల ఎకరాల వక్ఫ్ భూమి మాత్రమే ఉండేదని... అది క్రమంగా విస్తరిస్తూ 10 లక్షల ఎకరాలకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూములను వెంటనే విడుదల చేయాలని.. లేకపోతే కోర్టును ఆశ్రయిస్తానని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News