Ayodhya Ram Mandir: అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చిన జడ్జిలకు రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం

Ayodhya trust invites five Judges who delivered historical verdict on Ram Janmbhoomi
  • 2019లో అయోధ్య రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు అంతిమ తీర్పు
  • తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
  • ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఆ ఐదుగురిలో ఒకరు
నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడా ఐదుగురు జడ్జిలకు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. జనవరి 22న అయోధ్యలో జరిగే ఈ వేడుకకు సదరు న్యాయమూర్తులను ప్రభుత్వ అతిథులుగా ఆహ్వానించారు. 

మాజీ సీజేఐ రంజన్ గోగోయ్, మాజీ సీజేఐ ఎస్ఏ బోబ్డే, ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ 2019లో చారిత్రక తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎవరో కాదు... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.  

కాగా, జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనుండగా, జనవరి 16 నుంచే ఏడు రోజుల క్రతువులు నిర్వహిస్తున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి దాదాపు 7 వేల మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో రాజకీయనేతలు, సెలెబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతర రంగాలకు చెందినవారు ఉన్నారు.
Ayodhya Ram Mandir
Judges
Historical Verdict
Ram Janmbhoomi
Supreme Court
India

More Telugu News