Death Penalty: కత్తెరతో గొంతులో పొడిచి.. సుత్తితో తలపగలగొట్టి భార్యను కిరాతకంగా హత్యచేసిన భర్తకు మరణశిక్ష

  • హైదరాబాద్ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు సంచలన తీర్పు
  • జనవరి 2019లో దారుణానికి ఒడిగట్టిన ఇమ్రాన్ 
  • రూ. 30 వేలు ఇవ్వనందుకు భార్యపై క్రూరంగా ప్రవర్తించిన వైనం
  • మరణశిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధించిన న్యాయస్థానం
Hyderabad Man Gets Death Sentence In Murder Case

భార్యను అత్యంత కిరాతకంగా హత్యచేసిన భర్తకు హైదరాబాద్ కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడు ఇమ్రాన్ ఉల్ హక్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. మరణశిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా కూడా విధిస్తూ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ సీవీ ఎస్ సాయిభూపతి తీర్పు వెలువరించారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కారు డ్రైవర్ అయిన ఇమ్రాన్ జనవరి 2019లో ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడు. సొంతంగా కారు కొనుక్కొనేందుకు రూ. 30 వేలు కావాలని భార్యను డిమాండ్ చేశాడు. అందుకామె నిరాకరించడంతో జనవరి 6న కత్తెరతో భార్య గొంతులో పొడిచాడు. ఆపై సుత్తితో తలపై మోదాడు. ప్రైవేటు భాగాల్లో స్క్రూ డ్రైవర్ చొప్పించాడు. దాంతో ఆమె చనిపోయింది. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. 

ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడు ఇమ్రాన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.

More Telugu News