Coaching Centers: కోచింగ్ సెంటర్‌లకు నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర విద్యాశాఖ

New Guidelines for Coaching Centers issued by Central Education Department
  • 16 ఏళ్ల లోపు విద్యార్థులను చేర్చుకోవడానికి వీల్లేదని కోచింగ్ సెంటర్లకు స్పష్టం చేసిన కేంద్రం
  • ఫీజుల నుంచి సౌకర్యాల వరకు కోచింగ్ సెంటర్లకు నిర్దిష్టమైన మార్గదర్శకాల జారీ
  • ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిక
పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి దోపిడీకి పాల్పడుతున్న కోచింగ్ సెంటర్లను నియంత్రించడమే లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థులను కోచింగ్ సెంటర్లు చేర్చుకోకూడదని గైడ్‌లైన్స్ స్పష్టం చేశాయి. పాఠశాల స్థాయి విద్య పూర్తయిన తర్వాత మాత్రమే ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని సూచించాయి. మంచి ర్యాంకులు లేదా మార్కులు వస్తాయని నమ్మించే ప్రయత్నాలు చేయకూడదని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఈ నూతన మార్గదర్శకాలు సూచించాయి. పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, కోచింగ్ సెంటర్లలో సౌకర్యాల లేమి, అగ్నిప్రమాదాలు, బోధనా పద్ధతులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. 

ఫీజులు న్యాయబద్ధంగా, సహేతుకంగా ఉండాలని నూతన మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. పారదర్శకంగా రసీదులు ఉండాలని పేర్కొన్నాయి. కోర్సుల నుంచి నిష్క్రమించే విద్యార్థులకు తిరిగి ఫీజు సర్దుబాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించాయి. మౌలిక సదుపాయాలు, విద్యార్థికి కనీస స్థలం కేటాయింపు, ప్రథమ చికిత్స, వైద్య సౌకర్యాల ఏర్పాటు, విద్యుత్, వెంటిలేషన్, వెలుతురు, తాగునీరు, భద్రతా చర్యలు తప్పనిసరిగా ఉండాలని నూతన మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారి కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చునని స్పష్టం చేశాయి. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.

కోచింగ్ సెంటర్లు చేయకూడనివి ఇవే..
1. గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ అర్హతలు ఉన్న బోధనా సిబ్బందిని నియమించుకోకూడదు.
2. తల్లిదండ్రులు/విద్యార్థులను కోచింగ్ సెంటర్‌లో చేర్పించుకునేందుకు మోసపూరిత ప్రకటనలు చేయకూడదు. ర్యాంక్‌లు లేదా మంచి మార్కుల హామీలు ఇవ్వకూడదు.
3. వయసు 16 సంవత్సరాల కంటే తక్కువ విద్యార్థులను చేర్చుకోకూడదు. పాఠశాల స్థాయి విద్య తర్వాత మాత్రమే విద్యార్థులకు ప్రవేశం ఇవ్వాలి.
4. కోచింగ్ నాణ్యత లేదా సౌకర్యాలు, మార్కులు లేదా ర్యాంకులకు సంబంధించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు.
5. ఒక విద్యార్థికి అవసరమైన కనీస స్థలం ఉన్నప్పుడు మాత్రమే అతడిని చేర్చుకోవాలి.

నూతన మార్గదర్శకాల లక్ష్యాలు ఇవే..
1. కోచింగ్ సెంటర్ల నమోదు, నియంత్రణ కోసం ఒక విధానాన్ని ఏర్పాటు చేయడం.
2. కోచింగ్ సెంటర్ల నిర్వహణకు కనీస ప్రమాణాలను నిర్వచించడం.
3. కోచింగ్ సెంటర్లలో చేరిన విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడం.
4. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో కోచింగ్ సెంటర్‌లను ప్రోత్సహించడం.
5. విద్యార్థుల మానసిక వికాసం, కెరీర్ గైడెన్స్‌లో కోచింగ్ సెంటర్లు ఉపయోగపడేలా ప్రోత్సహించడం
6. కోచింగ్ సెంటర్ల నమోదు, పునరుద్ధరణకు నిర్దిష్ట ప్రక్రియలు, షరతులను అందుబాటులోకి తీసుకురావడం.
Coaching Centers
New Guidelines
Education Ministry
study
competitive exams

More Telugu News