Sachin Tendulkar: సచిన్ కూడా డీప్ ఫేక్ బాధితుడే... ఎఫ్ఐఆర్ నమోదు

FIR files after Sachin Tendulkar alerts on a deepfake video
  • సెలెబ్రిటీలను చికాకు పెడుతున్న డీప్ ఫేక్ వీడియోలు
  • రష్మిక మందన్న వీడియో వైరల్
  • తాజాగా సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన సచిన్ పీఏ
సెలెబ్రిటీలకు ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. ఇటీవల రష్మిక మందన్న వీడియోతో ఈ అంశం బాగా చర్చనీయాంశం అయింది. తాజాగా, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ బాధితుల్లో ఒకరయ్యారు.

 సచిన్, ఆయన కుమార్తె సారా టెండూల్కర్ ఓ ఆన్ లైన్ గేమ్ ఆడి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారన్నట్టుగా ఆ నకిలీ వీడియో రూపొందించారు. ఇది డీప్ ఫేక్ వీడియో అంటూ సచిన్ నిన్ననే అందరినీ అప్రమత్తం చేశారు. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ను నమ్మవద్దని స్పష్టం చేశారు. అంతేకాదు, తన పీఏ రమేశ్ పార్థే ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సచిన్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ముంబయి వెస్ట్ సైబర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సచిన్ డీప్ ఫేక్ వీడియోతో ప్రచారం చేసుకుంటున్న ఆన్ లైన్ వెబ్ సైట్, ఫేస్ బుక్ పేజీ నిర్వాహకులు ఎవరన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. హుర్మా అనే ఫేస్ బుక్ పేజీలోనూ, స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ అనే గేమింగ్ సైట్ లోనూ సచిన్ డీప్ ఫేక్ వీడియో దర్శనమిస్తోందని సచిన్ పీఏ ఫిర్యాదులో పేర్కొన్నారు. సచిన్ ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూను డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్చివేసి, నకిలీ వీడియో రూపొందించారని వివరించారు.
Sachin Tendulkar
Deepfake Video
FIR
Mumbai

More Telugu News